మొహం చాటేసిన ముంగారు.. దేశవ్యాప్తంగా 35 శాతం వర్షపాతం లోటు

by Thanuru Gopichand |

దేశవ్యాప్తంగా ముంగారు పలకరింపులు ఊరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్న‌ది.

మొహం చాటేసిన ముంగారు.. దేశవ్యాప్తంగా 35 శాతం వర్షపాతం లోటు
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ముంగారు పలకరింపులు ఊరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్న‌ది. జూన్ సగం గడిచినా దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రతో పాటు కీలకమైన కోల్‌కతా నగరాలకు రుతుపవనాలు ఇంకా విస్తరించలేదు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) లెక్కల ప్రకారం.. జూన్ మొదటి 16 రోజుల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతంలో ఏకంగా 35 శాతం లోటు నమోదైంది. కేరళను ఆలస్యంగా తాకిన రుతుపవనాల పురోగతి అస్థిరంగా మారడంతో.. పశ్చిమ, మధ్య భారతదేశం వానల కోసం ఆవురావురుమంటున్నాయి. జూన్ 16న ఒక్కరోజే దేశంలో సాధారణం కంటే 72 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గుజరాత్, రాజస్థాన్, ఒడిశాతో పాటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ వంటి తక్కువ సాగునీటి వసతులున్న ప్రాంతాల్లో ఈ లోటు ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా పడనుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సైబర్ నేరగాళ్లు ‘పరాన్నజీవులు’: సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్స్

రుతుపవనాలు మొహం చాటేయడంతో దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడ‌బ్ల్యూసీ) నివేదికల ప్రకారం.. దేశంలోని 166 కీలక జలాశయాల్లో నీటి మట్టం వాటి మొత్తం సామర్థ్యంలో కేవలం 28 శాతానికే పరిమితమైంది. ఇది గత ఏడాది కంటే చాలా తక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటల సాగుకు అవసరమైన 70 శాతం నీటిని ఈ ముంగారు వానలే ఇస్తాయి. అయితే, ఈసారి సీజన్ అంతటా ఎల్ నినో ప్రభావం ఉండే ముప్పు ఉందని, దీనివల్ల రాబోయే రబీ పంటల సాగు కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ బార్క్లేస్ హెచ్చరించింది. రానున్న 4-5 రోజుల్లో వాతావరణంలో సానుకూల మార్పులు వచ్చి, రుతుపవనాలు పుంజుకోకపోతే తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడక తప్పదు.

Next Story