సెట్స్‌లో అరిచి సమస్యలు పెంచుకోవడం కంటే నా తప్పులను సరిదిద్దుకోవడానికే ప్రాధాన్యత ఇస్తా: నాగ్ అశ్విన్

by Mallepaka Hamsa |

దర్శకుడి ఆలోచనలను తెరపైకి తీసుకురావడం కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ మెన్లు, మేనేజర్లు రాత్రింబవళ్లు ఎంతో కష్టపడతారు.

సెట్స్‌లో అరిచి సమస్యలు పెంచుకోవడం కంటే నా తప్పులను సరిదిద్దుకోవడానికే ప్రాధాన్యత ఇస్తా: నాగ్ అశ్విన్
X

దిశ, సినిమా: ‘కల్కి’ వంటి విజువల్ వండర్‌తో గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన ‘సింగ్ గీతం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కల్కి-2’ షూటింగ్‌ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి-2 లాంటి వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించేటప్పుడు, షూటింగ్ సమయంలో వచ్చే విపరీతమైన ఒత్తిడి వల్ల ఎప్పుడైనా కోపం వస్తుందా? అని ఒక జర్నలిస్ట్ అడగ్గా నాగ్ అశ్విన్ చాలా కూల్‌గా సమాధానమిచ్చారు. "నాకు ఎంత కోపం వచ్చినా దాన్ని యూనిట్ సభ్యులపై చూపించడం అస్సలు ఇష్టం ఉండదు. ఒక దర్శకుడు సెట్స్‌లో కోపంతో గట్టిగా అరిస్తే, అక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణం దెబ్బతింటుంది.

ఆ భయం వల్ల సిబ్బంది సరిగ్గా పని చేయలేరు. దాని ప్రభావం చివరికి అవుట్‌పుట్‌పై పడి, కొన్నిసార్లు సీన్లను మళ్లీ రిషూట్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను కోపం తెచ్చుకోవడం కంటే, వచ్చిన సమస్యకు పరిష్కారం కనుగొనడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను" అని చెప్పారు. సినిమా నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకమని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. "దర్శకుడి ఆలోచనలను తెరపైకి తీసుకురావడం కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ మెన్లు, మేనేజర్లు రాత్రింబవళ్లు ఎంతో కష్టపడతారు. అలాంటి సమయంలో వారిపై అరిచేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పరిస్థితిని అర్థం చేసుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లడమే ఒక దర్శకుడి బాధ్యత. అయితే కొన్నిసార్లు సెట్స్‌లో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఇతరులపై కంటే నాపై నాకే ఎక్కువ కోపం వస్తుంది. ఆ సమస్యను నేను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇతరులను బ్లేమ్ చేయడం కంటే నా తప్పులను సరిదిద్దుకోవడానికే ప్రయత్నిస్తాను" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ తోటి వర్కర్స్‌ను గౌరవించే విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story