బట్టలు ఆరేస్తూ విద్యుదాఘాతానికి బలి..!

by Kodari Anjali |

రోజంతా కష్టపడి కూలి పని ముగించుకుని ఇంటికి చేరిన ఓ యువకుడు, కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన వేళ మృత్యువు కబళించింది.

బట్టలు ఆరేస్తూ విద్యుదాఘాతానికి బలి..!
X

దిశ, చందంపేట: రోజంతా కష్టపడి కూలి పని ముగించుకుని ఇంటికి చేరిన ఓ యువకుడు, కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన వేళ మృత్యువు కబళించింది. ఉతికిన బట్టలు ఆరేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందడంతో పెద్దమూల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన చేపూరి అరుణ్ కుమార్ (26) మంగళవారం సాయంత్రం కూలి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. స్నానం అనంతరం ఉతికిన బట్టలను ఆరేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పు మీదుగా వెళ్తున్న విద్యుత్ సర్వీస్ వైర్ బట్టలు ఆరేసే తీగకు తగలడంతో ఆ తీగలో విద్యుత్ ప్రవహించింది. ఈ విషయాన్ని గమనించని అరుణ్ కుమార్ బట్టలు ఆరేస్తుండగా ఒక్కసారిగా తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

భార్య కన్నీరు.. చిన్నారుల రోదనలు

అరుణ్ కుమార్‌కు భార్య చేపూరి అమరావతి, నాలుగు, ఆరేళ్ల వయస్సు గల ఇద్దరు చిన్నారులు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన యువకుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. తండ్రి కోసం చిన్నారులు వెక్కి వెక్కి ఏడవడం, భర్త మృతదేహాన్ని చూసి భార్య బోరున విలపించడం గ్రామస్తుల కళ్లను చెమ్మగిల్లేలా చేసింది.

పోలీసు కేసు నమోదు..

ఈ ఘటనపై మృతుడి భార్య చేపూరి అమరావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ వైర్లు, భద్రతా ప్రమాణాలపై కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

గ్రామంలో విషాద వాతావరణం..

నిత్యం కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న యువకుడు క్షణాల్లో మృత్యువాత పడటంతో పెద్దమూల గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, సంబంధిత శాఖలు తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. "బట్టలు ఆరేయడానికి వెళ్లిన అరుణ్... తిరిగి ఇంట్లోకి రాలేదు. కరెంట్ కాటు ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది."

Next Story