- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. DA పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పనిచేసే విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని విద్యుత్ రంగ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఉద్యోగ సంఘాలు వేచి చూస్తున్న కరవు భత్యం (Dearness Allowance) పెంపుదల ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్ ఉద్యోగుల డీఏను 1.62 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల డీఏ పెంపు ఫైలుపై సంతకం చేశారు. ఈ తాజా పెంపుతో విద్యుత్ ఉద్యోగుల మొత్తం కరవు భత్యం 19.272 శాతానికి చేరుకుంది. ఈ పెరిగిన డీఏ అలవెన్స్ తక్షణమే అమలుల్లోకి రానుండటంతో, ఉద్యోగులకు ఈ నెల జీతంతో పాటే పెరిగిన నగదు చేతికి అందనుంది.
ప్రభుత్వంపై ప్రతినెలా రూ.9.39 కోట్ల అదనపు ఆర్థిక భారం
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తెలంగాణ పవర్ సెక్టార్ పరిధిలోని టీజీ ట్రాన్స్‌కో (TG Transco), టీజీ జెన్‌కో (TG Genco), సదరన్ డిస్కం (TSSPDCL), నార్తర్న్ డిస్కం (TSNPDCL) ఉద్యోగులకు లబ్ధి కలుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 71,387 మంది రెగ్యులర్ ఉద్యోగులు, ఆర్టిజన్లు (Artisans), పెన్షనర్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. కాగా, ఈ డీఏ పెంపు వల్ల విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా రూ.9.39 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని అధికారులు వెల్లడించారు.






