- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కొరడా.. అడిషనల్ డీజీ వార్నింగ్
రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల తీరుపై ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది. ఇకపై చెల్లుబాటు అయ్యే పీఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్ లేకుండా ఏజెన్సీలను నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్,ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీస్ నియంత్రణాధికారి విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల తీరుపై ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది. ఇకపై చెల్లుబాటు అయ్యే పీఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్ లేకుండా ఏజెన్సీలను నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్,ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీస్ నియంత్రణాధికారి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో కార్మిక శాఖ అధికారుల సమక్షంలో.. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీల ఓనర్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనను ఏమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రతి సంస్థా నిబంధనలకు లోబడే పనిచేయాలని తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వ 'ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ యాక్ట్-2005',
రాష్ట్ర ప్రభుత్వ జీవో నంబర్ 43 ప్రకారం ప్రతి ఏజెన్సీకి కచ్చితంగా లైసెన్స్ ఉండాలని అడిషనల్ డీజీ స్పష్టం చేశారు. గతంలో కొందరు ఎలాంటి లైసెన్సులు లేకుండానే ఇష్టారాజ్యంగా గార్డులను, సూపర్‌వైజర్లను నియమించినట్లు తమ దృష్టికి వచ్చిందని, భవిష్యత్తులో అలాంటివి పునరావృతమైతే కేసులు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కాలంలో కొందరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూడటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టేందుకు, ఏజెన్సీలు తమ వద్ద పనిచేసే ప్రతి సిబ్బంది నేర చరిత్రను తెలుసుకునేందుకు కచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని ఆదేశించారు. వారి పూర్వాపరాలు పరిశీలించి, 21 రోజుల పాటు కనీస శిక్షణ బేసిక్ ట్రైనింగ్ ఇప్పించిన అనంతరం మాత్రమే విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. సెక్యూరిటీ గార్డుల శ్రమను దోపిడీ చేయకుండా, ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతన చట్టాలను తూచాతప్పకుండా అమలు చేయాలని యాజమాన్యాలకు ఉన్నతాధికారులు సూచించారు. వారికి ఈఎస్‌ఐ (ESI), పీఎఫ్ (PF) వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఏజెన్సీలదేనని, ఈ నిబంధనల అమలును కార్మిక శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. మరోవైపు, క్షేత్రస్థాయిలో అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, ఇతర ప్రాంతాల్లో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసుల తో మంచిగా వ్యవహరించాలని విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
తమ పరిధిలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న సెక్యూరిటీ ఏజెన్సీల అసోసియేషన్ల ప్రతినిధులు తమ లైసెన్సింగ్ ప్రక్రియలు, రెన్యువల్ సమస్యలు, ఆన్‌లైన్ పోర్టల్ పనితీరు, కార్మిక నిబంధనలకు సంబంధించిన పలు క్షేత్రస్థాయి ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అడిషనల్ డీజీ సానుకూలంగా స్పందిస్తూ.. పరిపాలనా పరమైన సమస్యలన్నీ పరిశీలించి, త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు. చట్టబద్ధంగా నడుచుకునే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు పోలీసు, ఇంటెలిజెన్స్, కార్మిక శాఖల తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి భేటీలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఓఎస్‌డీ వి. కమలాసన్ రెడ్డి, కూకట్‌పల్లి డీసీపీ రితురాజ్, అడ్మిన్ ఏజెన్సీ ఎస్పీ జి. చక్రవర్తిలతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కార్మిక నిబంధనలు, వేతనాల పర్యవేక్షణపై సుదీర్ఘంగా చర్చించేందుకు కార్మిక శాఖ తరఫున అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జి. సుమతి గోపాల్ దాస్ ప్రత్యేకంగా హాజరయ్యారు.






