- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని ఆసుపత్రులకూ ప్రామాణిక ఎక్విప్మెంట్ జాబితా.. మంత్రి ఆదేశాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను మెరుగుపరచడం, మందుల కొనుగోలులో అవినీతికి తావులేకుండా పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను మెరుగుపరచడం, మందుల కొనుగోలులో అవినీతికి తావులేకుండా పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (సీఎంఎస్) పనితీరుపై ఆయన బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల వరకు అన్ని స్థాయిల వైద్యశాలల్లో చికిత్సలు, వసతుల పరంగా ఏకరూపత ఉండేలా ఒక నిర్దిష్టమైన ప్రామాణిక ఎక్విప్మెంట్ జాబితాను తయారు చేసి నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మందుల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు క్యూర్ పరిధిలో ప్రస్తుతం ఉన్న రెండు సీఎంఎస్ కేంద్రాలకు అదనంగా మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అలాగే, సీఎంఎస్ ల నిర్వహణ కోసం 15 శాశ్వత భవనాల నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీజీఎంఎస్ఐడీసీ అధికారులకు సూచించారు.
మందుల కొనుగోళ్లలో పారదర్శకత కోసం 5 కమిటీలు...
సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, సర్జికల్స్, రీజెంట్స్, ఎక్విప్మెంట్ల టెండర్లలో పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 2 కమిటీలకు అదనంగా మరో 3 కమిటీలను కొత్తగా ఏర్పాటు చేసి, మొత్తం 5 కమిటీలను నియమించాలని మంత్రి ఆదేశించారు. లీకేజీలు, అవకతవకలకు తావులేకుండా ఉండేందుకు సంస్థలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని సంస్థ ఎండీ గౌరవ్ ఉప్పల్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆస్పత్రులలో టీజీఎంఎస్ఐడీసీ ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, ఎక్విప్మెంట్స్, సివిల్ వర్క్స్ లను రెగ్యులర్ గా పర్యవేక్షించడానికి తక్షణమే 'నోడల్ ఆఫీసర్స్'ను నియమించాలని, టెండర్ల ప్రక్రియను నెలవారీగా విధిగా సమీక్షించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. హిమోఫిలియా బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. హిమోఫిలియా బాధితులకు నెలవారీగా అవసరమైన మందులను ఉచితంగా అందించాలని, ఈ ఔషధాలను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల (జీజీహెచ్) ద్వారా బాధితులకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. హిమోఫిలియా రోగులకు ఉపయోగించే అత్యంత కీలకమైన ఎమిసిజుమాబ్ మందులు ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించగా, వీటిని అదనంగా ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో కూడా తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, ఇంచార్జి ఈడీ వెంకటేశ్వర్లు, సంస్థ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






