Women's T20 World Cup : అదరగొట్టిన తెలుగమ్మాయి శ్రీచరణి.. నెదర్లాండ్స్‌పై భారత్ భారీ విజయం

by Harish |

Womens T20 World Cup : అదరగొట్టిన తెలుగమ్మాయి శ్రీచరణి.. నెదర్లాండ్స్‌పై భారత్ భారీ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. లీడ్స్ వేదికగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో గెలుపొందింది. షఫాలీ వర్మ(55, 20/3) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. బలమైన భారత్ ముందు పసికూన నెదర్లాండ్స్ నిలువలేకపోయింది. ముందుగా భారత్ బ్యాటింగ్ చేయగా.. స్మృతి మంధాన(74), షఫాలీ వర్మ(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లు 209 పరుగులు చేసింది. అనంతరం బంతితోనూ ఇండియా సత్తాచాటింది. తెలుగమ్మాయి శ్రీచరణి(19/4) నాలుగు వికెట్లతో చెలరేగింది. షెఫాలీ 3 వికెట్లు తీయగా.. నందని శర్మ 2 వికెట్లు పడగొట్టింది. భారత బౌలర్లు రెచ్చిపోవడంతో డచ్ జట్టు 114 పరుగులకే ఆలౌటైంది. 17.3 ఓవర్లలోనే కుప్పకూలింది. ఆ జట్టులో బాబెట్టె డె లీడె చేసిన 28 రన్సే టాప్ స్కోరంటే నెదర్లాండ్స్ ఏ విధంగా తేలిపోయిందో అర్థం చేసుకోవచ్చు. భారత్ ఆదివారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఎదుర్కోనుంది.

సత్తాచాటిన తెలుగమ్మాయి

చేజింగ్‌లో భారత బౌలింగ్‌ ముందు నెదర్లాండ్స్ నిలువలేకపోయింది. ఆ జట్టులో ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. తెలుగమ్మాయి శ్రీచరణి తన స్పిన్ మాయతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇక బ్యాటుతో రాణించిన షఫాలీ బంతితో కూడా మెరిసింది. ఈ ఇద్దరి స్పిన్నర్లు డచ్ జట్టు పతనాన్ని శాసించారు. ముందుగా పేసర్ నందిని.. హీథర్ సీగర్స్(21), బాబెట్టె డె లీడె(28)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. ఆ తర్వాత షఫాలీ, శ్రీచరణి స్పిన్ మాయలో చిక్కుకున్న నెదర్లాండ్స్ అందులో నుంచి బయటకు రాలేకపోయింది. దీంతో ఏ దశలోనూ ఆ జట్టు కోలుకోలేదు. దీంతో 15 బంతులు మిగిలి ఉండగానే ఆ జట్టు 114 పరుగులే చేసి ఆలౌటైంది.

రాణించిన స్మృతి, షఫాలీ

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టులో స్మృతి మంధాన, షఫాలీ వర్మ అదిరే ప్రదర్శన చేశారు. జట్టు 209 పరుగుల భారీ స్కోరు చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లుగా వచ్చిన వీరిద్దరూ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ పోటాపోటీగా ఫోర్లు కొట్టారు. స్మృతి 47 బంతుల్లో 74 రన్స్ చేయగా.. షఫాలీ 38 బంతుల్లో 55 పరుగులు చేసింది. ఇక వారి తర్వాత మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేదు. రోడ్రిగ్స్(19), యాస్తికా భాటియా(3), హర్మన్‌ప్రీత్ కౌర్(12) నిరాశపరిచారు. వారు కూడా రాణించి ఉంటే భారత్ ఇంకా భారీ స్కోరు చేసేది. రిచా ఘోష్(20 నాటౌట్), దీప్తి(10 నాటౌట్) విలువైన రన్స్ జోడించడంతో స్కోరు 200 దాటింది.

Next Story