ముందస్తు ప్రణాళికతో ఖరీఫ్ కు సన్నద్ధం కావాలి

by velandi.Saikiran |

ముందస్తు ప్రణాళికలతో వానాకాలం వ్యవసాయానికి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

ముందస్తు ప్రణాళికతో ఖరీఫ్ కు సన్నద్ధం కావాలి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: సాంకేతికత, ముందస్తు ప్రణాళికలతో వానాకాలం వ్యవసాయానికి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన శాఖల ప్రస్తుత పరిస్థితి, రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల సవాళ్లను తట్టుకుంటూ, రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించి, నికర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా అధికారులు సరైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని అన్నారు. తృణధాన్యాలు, నూనెగింజలు, పత్తి సాగు పెరిగేలా చూడాలని తెలిపారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వస్తున్నందున ఆ పంటతో తయారయ్యే ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటును జిల్లాలో ప్రోత్సహించాలని అన్నారు. నాణ్యత గల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతులకు వాతావరణ అంచనాలు తెలియజేయాలని, యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ పై అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.

వ్యవసాయేతర రంగాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీ పథకాలపై రైతులకు గ్రామాల వారిగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఉద్యానవన శాఖ అందిస్తున్న పథకాలను వివరించే వాల్ పోస్టర్లు ముద్రించి.. రైతు వేదికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.పండ్ల తోటలు, పూల తోటలు, ఆయిల్ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతుల విజయ గాధలను, గ్రామాల్లో వివరించడం ద్వారా వారు సైతం పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. చేప పిల్లల విత్తనాల విడుదల సకాలంలో జరిగేలా ఇప్పటినుండే సన్నద్ధం కావాలని తెలిపారు. పశు సంపద అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, పశువుల ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి విజయభారతి, పశుసంవర్ధక శాఖ అధికారి లింగారెడ్డి, ఆత్మ పిడి చత్రు నాయక్, మార్క్ఫెడ్ డిఎం గౌరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story