రేపు అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభం

by Taduka Kalyani |

రాష్ట్రస్థాయి వనమహోత్సవం–2026 కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేసిన "అరణ్య అర్బన్ పార్క్ – ఫారెస్ట్ ఎకో పార్క్"ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

రేపు అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభం
X

దిశ, ఆర్మూర్: రాష్ట్రస్థాయి వనమహోత్సవం–2026 కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేసిన "అరణ్య అర్బన్ పార్క్ – ఫారెస్ట్ ఎకో పార్క్"ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరుకానున్నారు. మాక్లూర్ మండలం మానిక్‌బండార్, మామిడిపల్లి-III, చిన్నాపూర్-II రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అటవీ శాఖ ఈ పార్కును అభివృద్ధి చేసింది. మొత్తం 166.411 హెక్టార్లు (476.30 ఎకరాలు) విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పార్కు నిజామాబాద్ నగర శివారులో, జాతీయ రహదారి-63 పక్కన ఉంది. అఫారెస్టేషన్, కాంపా (CAMPA), నుడా (NUDA), ఎన్‌ఎంసీ (NMC) వంటి పథకాల కింద సుమారు రూ.5 కోట్ల వ్యయంతో ఈ పార్కును అభివృద్ధి చేశారు. పర్యాటకులు, సందర్శకుల కోసం గ్రాండ్ ఎంట్రన్స్ గేట్, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్, పిల్లల అడ్వెంచర్ జోన్, వాచ్ టవర్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ రూమ్, శౌచాలయాలు, రచ్చబండలు తదితర సదుపాయాలను ఏర్పాటు చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ రక్షణ కోసం 4,411 మీటర్ల చైన్‌లింక్ ఫెన్సింగ్, 164 మీటర్ల రక్షణ గోడ నిర్మించారు. ఆక్రమణలు, పట్టణీకరణ ఒత్తిళ్ల నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ అర్బన్ పార్క్ ద్వారా నిజామాబాద్ నగరానికి పచ్చని ఊపిరితిత్తుల్లాంటి (గ్రీన్ లంగ్ స్పేస్) ప్రాంతం అందుబాటులోకి రానుంది. పర్యావరణ పర్యాటకం, పర్యావరణ అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలి, వినోద కార్యక్రమాలకు ఇది కేంద్రంగా మారనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రకృతి ప్రేమికులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

Next Story