అవయవదానంపై సజ్జనర్ పోస్ట్ వైరల్..

by Kodari Anjali |

జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన మంద చైతన్య అవయవదానంపై సజ్జనర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అవయవదానంపై సజ్జనర్ పోస్ట్ వైరల్..
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన మంద చైతన్య అవయవదానం ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఐపీఎస్ అధికారి, రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలతో గుర్తింపు పొందిన వీసీ సజ్జనర్ తన సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేయడంతో విషయం మరింత వైరల్‌గా మారింది. మంద చైతన్య (34) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించబడ్డాడు. అనంతరం ఆయన భార్య మంద సరస్వతి గొప్ప మనసుతో రెండు మూత్రపిండాలు, గుండె, కాలేయం, రెండు కంటి కార్నియాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ అవయవాల ద్వారా ఆరుగురు రోగులకు కొత్త జీవితం లభించింది. ఈ విషయాన్ని సజ్జనర్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రస్తావిస్తూ, దుఃఖ సమయంలోనూ మానవతా దృక్పథంతో అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులను అభినందించారు. అవయవదానం ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అని పేర్కొంటూ ప్రజల్లో అవగాహన పెంచేలా సందేశాన్ని పంచుకున్నారు. సజ్జనర్ చేసిన పోస్ట్‌కు వేల సంఖ్యలో లైక్‌లు, షేర్లు, కామెంట్లు రావడంతో జాన్‌పహాడ్ గ్రామ యువకుడి అవయవదాన ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని నెటిజన్లు, ప్రజాప్రతినిధులు, వైద్యులు ప్రశంసిస్తున్నారు.

Next Story