ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్.. ఈహెచ్‌సీటీ బోర్డు నియామకం

by Kema Shiva Kumar |

ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయిస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ (EHCT) బోర్డు సభ్యులను నియమిస్తూ తెలంగాణ సర్కార్ జీవో‌ను విడుదల చేసింది.

ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్.. ఈహెచ్‌సీటీ బోర్డు నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంరక్షణ, ఆరోగ్య భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన సరికొత్త ఆరోగ్య పథకాన్ని (Employee Health Scheme) క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి వీలుగా ఎంప్లాయిస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ (EHCT)కు బోర్డు సభ్యులను నియమించింది. ఈ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోను కూడా విడుదల చేసింది.

చైర్మన్‌గా సీఎస్.. 29 మందితో బోర్డు ఏర్పాటు

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఎంప్లాయిస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ (EHCT) బోర్డుకు చైర్మన్‌గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వ్యవహరించనున్నారు. ఈ బోర్డులో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిపి మొత్తం 29 మంది సభ్యులను నియమించారు. ఇకపై రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి సంబంధించిన పూర్తి బాధ్యతలను, నిధుల నిర్వహణను ఈ ట్రస్టే పర్యవేక్షించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత (Cashless) వైద్య సేవలు అందించేలా, కొత్త హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన పూర్తి విధివిధానాలను (Guidelines) రూపొందించే బాధ్యతను ప్రభుత్వం ఈ ట్రస్ట్ బోర్డుకు అప్పగించింది. ఈ నియామకాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటైన ఈహెచ్‌సీటీ బోర్డు సభ్యులంతా వీలైనంత త్వరగా సమావేశమై, ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ విధివిధానాలను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.

Next Story