కాంగ్రెస్‌ది ప్రజా వంచన పాలన

by Taduka Kalyani |

బీఆర్‌ఎస్‌ త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు అసాధ్యమైన ఆశలు చూపి ఇప్పుడు నయవంచనకు పాల్పడుతోందని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వి.జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ది ప్రజా వంచన పాలన
X

దిశ, హుస్నాబాద్: బీఆర్‌ఎస్‌ త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు అసాధ్యమైన ఆశలు చూపి ఇప్పుడు నయవంచనకు పాల్పడుతోందని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వి.జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శ్రీ సాయి ఏసీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నియోజకవర్గస్థాయి సభ్యత్వ నమోదు, ఓటర్ల ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో పదవులను గడ్డిపోచలా త్యాగం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దైతే, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన మోసపూరిత చరిత్ర రేవంత్‌రెడ్డిదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చి, 100 పడకల ఆసుపత్రి తెచ్చి, గౌరవెల్లి ప్రాజెక్టును దాదాపు పూర్తి చేశామన్నారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని గౌరవెల్లి ప్రాజెక్టు పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉన్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్సేనని.. తాము కేవలం ప్రతిపక్షం మాత్రమే కాదని, వచ్చే ఎన్నికల్లో పాలకపక్షం కాబోయేది బీఆర్‌ఎస్సేనని ఘంటాపదంగా చెప్పారు. మరో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 మాసాలు గడుస్తున్నా రైతుబంధు, రైతుబీమా ఊసే లేదని, ఆడబిడ్డలకు ఇస్తానన్న రూ.2500 ఇవ్వకుండా నయవంచనకు గురిచేశారని ధ్వజమెత్తారు. బీసీల జనాభా గణనను 51 శాతం నుంచి 42 శాతానికి ఎలా తగ్గించారో మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాలను కనుమరుగు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు.

కార్యకర్తలకు దిశానిర్దేశం:

ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరిగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌) అత్యంత కీలకమైనదని, డబుల్ ఓట్లు, మరణించిన వారి పేర్ల తొలగింపుపై బూత్ లెవెల్ ఏజెంట్లు (బిఎల్‌ఓ) అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు. గతంలో ఇక్కడ 48,200 సభ్యత్వాలు జరిగాయని, ఈసారి అంతకుమించి నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కరీంనగర్ జిల్లా పార్టీ ఇన్చార్జి జి.వి. రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Next Story