మూడో కాన్పుకు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాల్సిందే: తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-30 07:18:02  IST  )

మూడోాసారి గర్భం దాల్చిన మహిళా ఉద్యోగినులకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మూడో కాన్పుకు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాల్సిందే: తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రసూతి సెలవుల (Maternity Leave)కు సంబంధించి మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక తీర్పును వెలువరించింది. మూడోసారి గర్భం దాల్చిన మహిళా ఉద్యోగినులకు కూడా ప్రసూతి సెలవులను నిరాకరించకూడదని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రసూతి ప్రయోజనాలు అనేవి మానవీయ కోణంతో కూడుకున్నవని, వాటిని కేవలం పిల్లల సంఖ్యతో ముడిపెట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, తమిళనాడు ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఓ మహిళా ఉద్యోగి తన మూడో కాన్పు కోసం ప్రసూతి సెలవులకు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తిరస్కరించింది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారికి ఈ సెలవులు వర్తించవని సర్కార్ వాదించింది.

అయితే, వారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ సదరు మహిళా ఉద్యోగి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెటర్నిటీ లీవ్స్ అనేవి కేవలం సెలవులు మాత్రమే కాదని.. అవి తల్లి ఆరోగ్యం, శిశువు సంరక్షణకు సంబంధించిన ప్రాథమిక అవసరాలని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాల చట్టం (Maternity Benefit Act) ప్రకారం సెలవుల విషయంలో పిల్లల సంఖ్యపై పరిమితి విధించలేదని, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిబంధనలతో ఆ ప్రయోజనాలను ఆపలేదని వివరించింది. మూడో కాన్పు అని చెప్పి సెలవులు నిరాకరించడం వివక్ష అవుతుందని, సదరు మహిళా ఉద్యోగికి వెంటనే సెలవులు మంజూరు చేయాలని హైకోర్టు తీర్పును వెలువరించింది.

అత్యాచార బాధితుల గర్భవిచ్ఛిన్నంపై కొత్త చట్టం తెండి: సుప్రీంకోర్టు.

Next Story