సర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలిగిస్తుంది

by Taduka Kalyani |

ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

సర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలిగిస్తుంది
X

దిశ, వరంగల్ బ్యూరో: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హన్మకొండలో ఆదివారం నిర్వహించిన నగర పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలని రాజ్యాంగంలో ఉందని, ఇప్పటికే రెండుసార్లు ఈ ప్రక్రియ జరిగిందని, 2026లో మరోసారి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతోందన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా పనిచేస్తే పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయని, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ శ్రేణులు ఎంత చురుగ్గా పాల్గొంటే రానున్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అంత మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. కార్పొరేటర్లు, ఆశావహ అభ్యర్థులు, పార్టీ నాయకులు బూత్ స్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాలని, కేసీఆర్ అభిమానుల ఓట్లు మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రేటర్ వరంగల్‌పై మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలి

బూత్ లెవల్ అధికారులతో కలిసి పార్టీ ఏజెంట్లు పనిచేయాలని, సహకరించని అధికారులపై వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. తొందరలోనే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశముందని, అందరూ బాధ్యతగా పనిచేసి గ్రేటర్ వరంగల్‌పై మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు బీఆర్ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన హరీశ్‌రావు.. గురుకుల పాఠశాలలు, సింగరేణి, హ్యామ్ మోడల్ రోడ్లలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడికి పోయిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వడ్ల కొనుగోలు విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని, ప్రస్తుతం రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొంతమంది పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వరంగల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. చట్టం అందరికీ సమానమనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story