భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో తొలి విజయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-14 17:16:19  IST  )

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో తొలి విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ (ICC Women's T20 World Cup) గ్రూప్-1 ఆరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బదులుగా 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దాయాది పాక్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది.

మంధాన హాఫ్ సెంచరీ, మెరిసిన రిచా ఘోష్

భారత ఓపెనర్ స్మృతి మంధాన చక్కని ఫామ్‌ను ప్రదర్శిస్తూ 44 బంతుల్లో 68 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36 పరుగులు)తో కలిసి ఆమె మూడో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివరి ఓవర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లో 34 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేసి జట్టు స్కోరును 170కి చేర్చింది. పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సనా 2 వికెట్లు పడగొట్టింది.

భారత బౌలర్ల ప్రతాపం.. పాక్ మిడిలార్డర్ ఢమాల్

171 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు భారత బౌలింగ్ దాడికి తల్లడిల్లింది. సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ అద్భుతమైన స్పెల్‌తో 4 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ నడుం విరిచింది. దీంతో పాటు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. మరో బౌలర్ శ్రీ చరణి 3 వికెట్లతో రాణించింది. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ (41 పరుగులు) మినహా మిగిలిన వారెవరూ రాణించలేకపోయారు.



Next Story