ప్రభుత్వ వైద్య రంగంలోనూ ఏఐ సేవలు.. మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ప్రకటన

by Ramesh Naini |

తెలంగాణలోని ప్రభుత్వ వైద్య రంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానిస్తూ, త్వరలోనే జిల్లా ఆస్పత్రుల్లోనూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.

ప్రభుత్వ వైద్య రంగంలోనూ ఏఐ సేవలు.. మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య రంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానిస్తూ, త్వరలోనే జిల్లా ఆస్పత్రుల్లోనూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. హైటెక్ సిటీ యశోద ఆస్పత్రిలో జరిగిన ‘ఆరోగ్య రంగంలో ఏఐ’ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కృత్రిమ మేధస్సు వైద్యులను భర్తీ చేయదని, వారి సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఎక్స్‌రేల ఏఐ విశ్లేషణ, సెప్సిస్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులను ముందే గుర్తించే సాంకేతికతలను ప్రవేశపెట్టామన్నారు.

భవిష్యత్ వైద్యులను ఏఐ యుగానికి సిద్ధం చేసేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డిజిటల్ క్లాస్‌ రూమ్స్, సిమ్యులేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఫార్మా, బయోటెక్నాలజీ, వ్యాక్సీన్ తయారీ, వైద్య పరిధోధన రంగాల్లో గ్లోబల్ హబ్‌గా ఉన్న హైదరాబాద్, త్వరలోనే ఏఐ హెల్త్‌కేర్ పరిష్కారాలకు కూడా ప్రపంచ కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన వైద్య నిపుణులు, పరిశోధకులు, సాంకేతిక రంగ ప్రతినిధులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

Next Story