- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ, ఒడిశాలకు భారీ గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో రూ.39,290 కోట్ల విలువైన ఆరు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. మొత్తం రూ.39,290 కోట్ల విలువైన 6 ముఖ్యమైన ప్రాజెక్టులు, పథకాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ భేటీలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పెద్ద పీట వేసింది. వరంగల్ పరిధిలోని రెండు ప్రధాన జాతీయ రహదారులను నాలుగు లైన్ల రహదారులుగా విస్తరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.
అదేవిధంగా ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో (NCR) వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఒక మైలురాయి లాంటి రెండేళ్ల పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్యానికి 40 శాతం రవాణా రంగమే కారణం అవుతున్న నేపథ్యంలో.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్ (NCRPB) ఆధ్వర్యంలో పాత ట్రక్కులు, బస్సులను రీప్లేస్ చేసి, క్లీనర్ మొబిలిటీని ప్రోత్సహించనున్నారు. ఇక ఒడిశా రాష్ట్ర ప్రయోజనాల కోసం కోస్టల్ హైవే ప్రాజెక్ట్ ఫేజ్-1కు ఆమోదం లభించింది. ఈ హైవే రామేశ్వర్ నుంచి కోణార్క్ మీదుగా పారాదీప్ వరకు సాగుతుంది. ఇది ఒడిశా దక్షిణ తీరం నుంచి మధ్య తీర ప్రాంతాన్ని కలుపుతూ సాగే అత్యంత కీలకమైన రహదారి. చివరగా బీహార్‌లోని ఖగరియా - పూర్ణియా మధ్య NH-31, NH-231 జాతీయ రహదారులను నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలో ఉన్న NH-347B రహదారి అప్‌గ్రేడేషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.






