- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం: ప్రధాని మోడీ పర్యటన రద్దు, ప్రారంభోత్సవం వాయిదా
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలో గల చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ)లో సోమవారం (ఏప్రిల్ 20) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలో గల చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ)లో సోమవారం (ఏప్రిల్ 20) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఈ రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయాల్సి ఉండగా, ఈ అనూహ్య ప్రమాదం కారణంగా ఆయన రాజస్థాన్ పర్యటన రద్దయింది. రిఫైనరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
గంటన్నర పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది
రిఫైనరీలోని ‘క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్’లో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే సుమారు 50 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది సుమారు గంటన్నర పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి ఎమర్జెన్సీ బృందాలను మోహరించారు.
ప్రధాని సభ వాయిదా
వాస్తవానికి మంగళవారం రిఫైనరీ ప్రారంభోత్సవంతో పాటు ఓ భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించాల్సి ఉంది. అగ్నిప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేసినట్లు సీఎం భజన్‌లాల్ శర్మ కార్యాలయం ధృవీకరించింది. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సోమవారం సాయంత్రం పచ్‌పద్ర వెళ్లాల్సిన సీఎం పర్యటన కూడా రద్దయింది. ఈ ప్రమాదంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. ‘పచ్‌పద్ర రిఫైనరీలో అగ్నిప్రమాదం వార్త తీవ్ర ఆందోళన కలిగించింది. రాజస్థానీలందరికీ గర్వకారణమైన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు ఇలా జరగడం అత్యంత దురదృష్టకరం. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.






