ఆస్తుల వివరాల్లో తేడాలు: టీవీకే చీఫ్‌ విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-20 13:14:11  IST  )

తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది.

ఆస్తుల వివరాల్లో తేడాలు: టీవీకే చీఫ్‌ విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాల వెల్లడికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు, విజయ్‌కు నోటీసులు జారీ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తుల వివరాల వెల్లడిపై స్పష్టత లేదని, ముఖ్యంగా రెండు వేర్వేరు నియోజకవర్గాల అఫిడవిట్లలో భారీ తేడాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెరంబూర్‌, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆస్తుల విలువ, వివరాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ఉన్నత న్యాయస్థానం, అఫిడవిట్లలో ఇలాంటి పొరపాట్లు ఉండటంపై అసహనం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ప్రజల్లోకి వెళ్తున్న నేతలు ఆస్తుల విషయంలో పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది.

రాజకీయ ప్రాధాన్యత..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ తన పార్టీని సిద్ధం చేస్తున్న తరుణంలో ఈ న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ విజయ్‌తో పాటు ఎన్నికల కమిషన్‌కు కూడా కోర్టు నోటీసులు పంపింది. ఒకవైపు విజయ్ తమిళనాడులో పర్యటిస్తూ తన ఉనికిని చాటుకుంటుండగా, మరోవైపు ఈ అఫిడవిట్ వివాదం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. విజయ్ తరపు న్యాయవాదులు ఈ తేడాలపై ఎలాంటి వివరణ ఇస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

TVK విజయ్ విడాకుల కేసు వాయిదా.. రూ. 250 కోట్ల భరణం అడుగుతున్న భార్య..?

Next Story