- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hormuz : భారత నౌకలపై కాల్పుల ఘటన.. స్పందించిన ఇరాన్ కీలక ప్రకటన
హోర్ముజ్ జలసంధిలో రెండు భారతీయ వాణిజ్య నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హోర్ముజ్ జలసంధిలో రెండు భారతీయ వాణిజ్య నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. సోమవారం ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘాయి మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడి చేసింది తమ దళాలేనా (ఐఆర్జీసీ అనుబంధ పడవలు) కాదా అన్నది ధ్రువీకరించు కునే పనిలో ఉన్నామని, సంబంధిత అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.
భారత్ తీవ్ర అభ్యంతరం..
ఈ కాల్పుల ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి ప్రతిస్పందనగా శనివారం ఇరాన్ రాయబారి డాక్టర్ మహ్మద్ ఫతాలీకి ఢిల్లీలోని విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలు, నావికుల భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా భారత విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు. భారత్‌కు వచ్చే నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పించే ప్రక్రియను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరారు. ఇందుకు స్పందించిన రాయబారి, భారత ప్రభుత్వ ఆందోళనలను తమ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
అమెరికాతో ముగిసిన చర్చల అధ్యాయం
మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ దళాలు (IRGC) ఇక్కడ దిగ్బంధనం విధించాయి. తొలి విడత చర్చలు విఫలమవడంతో అమెరికా కూడా నావికా దిగ్బంధనాన్ని ప్రయోగించింది. ఈ నేపథ్యంలో అమెరికాతో ఇకపై ఎలాంటి శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. అమెరికా గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదని, తదుపరి రౌండ్ చర్చలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని బాఘాయి స్పష్టం చేశారు. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.






