- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ ముందు మూడు దారులు
ఇరాన్ లో యుద్ధం మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో సుప్రీం లీడర్ హతమయ్యాడు. ఇప్పుడు ఇరాన్ ముందు మూడే దారులు ఉన్నాయి.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఇరాన్ ఇప్పుడు తన ఉనికికే సవాలు విసిరే అత్యంత క్లిష్టమైన మలుపులో ఉంది. ఫిబ్రవరి 28, 2026 నాటి దాడుల తర్వాత ఇరాన్ ఎదుట మూడు దారులు ఉన్నాయి. ఇవే ఇరాన్ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. ఆ మూడు దారులు, వాటి పర్యవసానాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. మతతత్వ సైనిక పాలన
ప్రస్తుతం ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత వీరు అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రాజ్యాంగబద్ధమైన ‘సుప్రీం లీడర్’ ఎంపిక ప్రక్రియను పక్కన పెట్టి లేదా తమకు అనుకూలమైన వ్యక్తిని (ఉదాహరణకు ముజ్తబా ఖమేనీ) ఆ పదవిలో కూర్చోబెట్టి, తెరవెనుక నుండి ఐఆర్ జీసీ పూర్తి పట్టు సాధిస్తుంది.
పరిణామాలు
నిరసనకారులను అణచివేయడానికి మార్షల్ లా (సైనిక చట్టం) విధించవచ్చు. దీనితోపాటు అమెరికా, ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులను తీవ్రం చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించవచ్చు. ఇప్పటికే అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్.. ఉత్తర కొరియా తరహాలో ప్రపంచ దేశాల నుండి పూర్తిగా దూరంగా ఉండిపోతుంది.
2. ప్రజాస్వామ్య విప్లవం
ఇది ప్రపంచ దేశాలు, ఇరాన్ యువత కోరుకుంటున్న మార్పు. ఇన్నేళ్లుగా అణచివేతకు గురైన ప్రజలు ఈ శూన్యాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. ఇరాన్ మాజీ రాజు షా వారసుడు రెజా పహ్లావి వంటి ప్రవాస నేతలు అంతర్జాతీయ మద్దతుతో దేశంలోకి ప్రవేశించడం. అదే సమయంలో ‘ఆర్టెష్’ (సాధారణ సైన్యం) లోని ఒక వర్గం ప్రజల పక్షాన నిలబడి ఐఆర్‌జీసీపై తిరుగుబాటు చేస్తే ప్రజాస్వాయ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నది.
పరిణామాలు
ఇస్లామిక్ రిపబ్లిక్ స్థానంలో సెక్యులర్ ప్రజాస్వామ్యం రావచ్చు. ఫలితంగా పశ్చిమ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని, ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి పొందవచ్చు. కానీ, 45 ఏళ్లుగా వేళ్లూనుకున్న ఇస్లామిక్ వ్యవస్థను ఒక్కసారిగా మార్చడం వల్ల వచ్చే పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉన్నది.
3. అంతర్గత యుద్ధం
ఇది ఇరాన్ కు అత్యంత ప్రమాదకరమైన దారి. అధికారం కోసం వివిధ వర్గాలు ఒకరిపై ఒకరు తలపడితే దేశం చిన్నాభిన్నం అవుతుంది. ఐఆర్జీసీలోని వివిధ విభాగాల మధ్య పోరు లేదా ఐఆర్జీసీకి వ్యతిరేకంగా ‘ఆర్టెష్’ సైన్యం యుద్ధం చేయడం. దీనికి తోడు కుర్దిష్, బలూచ్ వంటి జాతి పరమైన మైనారిటీ గ్రూపులు స్వయం ప్రతిపత్తి కోసం ఆయుధాలు పట్టడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ఇరాన్ ప్రజల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది.
పరిణామాలు:
మరో సిరియా అయ్యే ప్రమాదం ఉన్నది. దేశం చిన్న చిన్న భాగాలుగా విడిపోయి, ఏళ్ల తరబడి హింస కొనసాగుతుంది. రష్యా, చైనా ఒక వర్గానికి.. అమెరికా, ఇజ్రాయెల్ మరో వర్గానికి మద్దతు ఇచ్చి ఇరాన్ ను యుద్ధ భూమిగా మార్చడం. లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోవడం వల్ల పొరుగు దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది.






