Surgical Strike: పాకిస్తాన్‌పై మిస్సైళ్లతో ప్రతీకారం.. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఇదే

by Mahesh Kanagandla |   (  Updated:2025-05-07 03:25:59  IST  )

పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిపింది.

Surgical Strike: పాకిస్తాన్‌పై మిస్సైళ్లతో ప్రతీకారం.. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిపింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు జరిపి నేలమట్టం చేసింది. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే సరిహద్దుకు సమీపంలో భారత వైమానిక దళ యుద్ధ విమానం నుంచి లక్షిత ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేపట్టింది. ఇందులో మురిద్కే, కోట్లి, ముజఫరాబాద్, బహవల్‌పూర్‌లలోని ఉగ్రశిబిరాలు నేలమట్టమయినట్టు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ దాడులు జరిపినట్టు కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.44 గంటలకు వెల్లడించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను టార్గెట్ చేయలేదని తెలిపింది. ఇండియా చాలా జాగ్రత్తగా టార్గెట్‌లను ఎంచుకున్నదని వివరించింది. భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావులేకుండా జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టింది. భారత్ పై దాడులకు కుట్ర పన్నిన, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల స్థావరాలనే నాశనం చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. దాడి తర్వాత పహెల్గాం బాధితులకు న్యాయం దక్కిందని భారత ఆర్మీ సోషల్ మీడియాలో 1.51 గంటలకు పోస్టు పెట్టింది. పహెల్గాంలో అమానవీయ దాడి జరిపారని, దోషులను శిక్షిస్తామన్న తమ సంకల్పానికి ఆచరణ రూపం ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్‌ గురించి కేంద్రం నేడు అధికారికంగా వివరాలు వెల్లడించనుంది.

ప్రతీకారం తీర్చుకుంటాం: పాకిస్తాన్

భారత దాడులను పాకిస్తాన్ ధ్రువీకరించింది. బహవల్పూర్, కోట్లి, ముజఫరాబాద్‌లలోని మూడు ప్రాంతాల్లో భారత్ దాడులు జరిపిందని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) తెలిపింది. భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ విమానాలూ గగనతలంలో చక్కర్లు కొట్టాయని వివరించింది. కానీ, భారత్ తన సొంత గగనతలం నుంచే ఈ దాడులు జరిపిందని పేర్కొంది. ఈ దాడులను తాము వదిలిపెట్టబోమని, తాము నిర్దేశించుకున్న సమయంలో, ఎంచుకున్న ప్రాంతంలో స్పందిస్తామని తెలిపింది. భారత తాత్కాలిక సంతోషాన్ని శాశ్వత విషాదంతో భర్తీ చేస్తామని హెచ్చరించింది.

Read More : దడ పుట్టించిన ‘ఆపరేషన్ సింధూర్’.. 30 మంది తీవ్రవాదులు హతం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్ని ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి.. పాకిస్థాన్ ఉగ్రవాద రాజధాని ముజఫరాబాద్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే

Next Story