ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: పొగమంచు వల్ల వాహనాల ఢీ.. ఇద్దరు సజీవ దహనం

by Ramesh Naini |   (  Updated:2026-01-18 13:52:03  IST  )

కుండ్లీ-మానేసర్-పల్వాల్ (KMP) ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది.

ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: పొగమంచు వల్ల వాహనాల ఢీ.. ఇద్దరు సజీవ దహనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుండ్లీ-మానేసర్-పల్వాల్ (KMP) ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన వరుస వాహనాల ఢీకొన్న ఘటనలో ఒక లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో సబరస్, గుధి గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ సామగ్రి (క్రషర్) లోడ్‌తో వెళ్తున్న ఒక ట్రక్కు డ్రైవర్ దట్టమైన పొగమంచు కారణంగా అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. వెనుక వస్తున్న మరో నాలుగు వాహనాలు ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో మధ్యలో ఉన్న రెండు ట్రక్కుల్లో మంటలు చెలరేగాయి. ట్రక్కు క్యాబిన్‌లో మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్ రాకేశ్ (33), అతని సహాయకుడు (క్లీనర్) దేశ్‌రాజ్ (28) బయటకు రాలేక అక్కడికక్కడే మరణించారు. వీరిద్దరూ రాజస్థాన్‌లోని సికర్, అల్వార్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.

ఘటనా స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లు..

ఇక, సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు నాలుగు గంటల పాటు శ్రమించి వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ‘మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించాం. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏఎస్ఐ దేవ్ కీ నందన్ మీడియాకు తెలిపారు.

READ MORE ....

సిమెంట్ లోడ్ లారీ బీభత్సం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 14 మందికి గాయాలు

Next Story