ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారు.. భారత పర్యటనలో మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-05-24 09:54:48  IST  )

అమెరికాలో భారతీయులపై దాడులు, ఇరాన్ శాంతి ఒప్పందంపై యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో న్యూఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారు.. భారత పర్యటనలో మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా వాషింగ్టన్‌కు న్యూఢిల్లీ అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటిగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి (US Secretary of State) మార్కో రూబియో అన్నారు. భారత పర్యటనలో ఉన్న మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధం సంప్రదాయ దౌత్య సంబంధాలకు అతీతమైనదని, ప్రపంచ సవాళ్లపై లోతైన వ్యూహాత్మక ఏకీభావం ఇందులో ప్రతిబింబిస్తుందని రూబియో అన్నారు. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ ఉగ్రవాద నెట్‌వర్క్‌ల కారణంగా మన రెండు దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయాయని దాని ఫలితంగానే ఉగ్రవాద నిరోధక విషయంలో బలమైన పొత్తు మన మధ్య ఏర్పడిందన్నారు.

ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారు:

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, వివక్షపై అమెరికా విదేశాంగ మంత్రి (US Secretary of State) మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సమాజంలో జాత్యహంకారం ఒక భాగమనే వాదనను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారని, అక్కడక్కడ జరిగే కొన్ని ఒంటరి సంఘటనల ఆధారంగా మొత్తం దేశాన్ని అంచనా వేయలేమన్నారు. అమెరికాలో ఉన్న భారతీయ సమాజం అత్యంత విజయవంతమైనదని రూబియో కొనియాడారు. వ్యాపారం, సాంకేతికత, వైద్యం మరియు ప్రజా సేవ వంటి అన్ని రంగాలలో భారతీయ సంతతి నిపుణులు అద్భుతంగా రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో భారతీయులు అత్యంత విజయవంతమైన, గౌరవప్రదమైన సమాజంగా ఉన్నారని, కేవలం కొందరు వ్యక్తుల అనాగరిక చర్యల వల్ల భారత్-అమెరికా బంధాన్ని తప్పుగా చిత్రీకరించలేమని స్పష్టం చేశారు.

బలపడుతున్న భారత్-అమెరికా బంధం:

ఈ మీడియా సమావేశానికి ముందు ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, వాణిజ్యం, వ్యూహాత్మక సాంకేతికతలు, ఇంధనం మరియు ప్రాంతీయ భద్రతపై విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం (Comprehensive Global Strategic Partnership) గా అభివర్ణించారు.

రాబోయే కొద్ది గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త:

ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సంబంధించి రాబోయే కొద్ది గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉందని రూబియో అన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ చాలా వరకు దిగ్బంధించిన హోర్ముజ్ జలసంధిపై ఉన్న ఆందోళనలను ఈ కుదురుతున్న శాంతి ఒప్పందం పరిష్కరిస్తుందన్నారు. ఈ ఒప్పందం ఇరాన్ అణ్వాయుధం గురించి ఇకపై భయపడాల్సిన లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేని ప్రపంచానికి మనల్ని చేర్చుతుందన్నారు. కాగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం చాలా వరకు కుదిరిందని ఈ రోజు ఉదయం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రూబియో శుభవార్త వింటారనే మాటలు ఆసక్తిగా మారాయి.

భారత్-అమెరికా మధ్య కీలక డీల్స్..? జైశంకర్, మార్కో రూబియా భేటీలో చర్చలు

Next Story