- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్లాట్’ సొమ్ము ఇవ్వట్లే
రాష్ట్రంలో ‘ధరణి’, ‘భూ భారతి’ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకుని దురదృష్టవశాత్తు ఇతర కారణాలతో రద్దు చేసుకుంటే ఆ డబ్బుల సంగతి అంతే.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ‘ధరణి’, ‘భూ భారతి’ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకుని దురదృష్టవశాత్తు ఇతర కారణాలతో రద్దు చేసుకుంటే ఆ డబ్బుల సంగతి అంతే. ఆ స్టాంప్ డ్యూటీ మాత్రం తిరిగి ఇవ్వడం లేదు. అప్పట్లో ఒక్కసారి స్లాట్ బుక్ చేసుకుని ఫీజు చెల్లిస్తే ట్రాన్సక్షన్ చేసుకోవాల్సిందే. లేదంటే మరుసటి రోజైనా చేసుకోవాల్సిందే. అంతే తప్ప స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే కుదరదు. ఒకవేళ మీరు సేల్ డీడ్ రద్దు చేసుకుందామని అనుకున్నా, పెండింగ్ ఉంచినా స్టాంప్ డ్యూటీ సొమ్ము తిరిగి రావడం కష్టం. ఇలా ఎంతో మంది స్లాట్స్ రద్దు చేసుకున్న సొమ్ము రాక ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని రిటర్న్ చేయించారు. కానీ చాలా జిల్లాల్లో ఫీజు వాపస్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్లుగా కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాస్తవానికి సీసీఎల్ఏ మెమో నం.6309/Assn.(1)/2021-22 ప్రకారం ఎవరైనా స్లాట్ బుక్ చేసిన ఆరు నెలల్లోపు క్యాన్సిల్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీని రిటర్న్ చేసే అధికారం కలెక్టర్ కు ఉంది. కనీసం ఆరునెలల తర్వాత ధరణిలో స్లాట్ క్యాన్సిల్ చేస్తే కమిషనర్ అండ్ ఐజీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కు రిటర్న్ చేసే అధికారం ఉంది. కానీ కలెక్టర్లు, సీసీఎల్ఏ అధికారులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ పట్టించుకోవడం లేదు.
కలెక్టర్ కు అధికారం ఉన్నా..
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ రైతు 2021 జులై 1న ధరణి పోర్టల్లో బుక్ చేసిన రిజిస్ట్రేషన్ స్లాట్ క్యాన్సల్ చేసుకున్నాడు. స్టాంప్ డ్యూటీ రిఫండ్ రూ.1,38,921.. నాలుగేళ్లు గడిచినా రాకపోవడంతో విసిగి చెంది హైకోర్టులో 2025 జులై 14న అడ్వకేట్ గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి ద్వారా కేసు వేశారు. పిటిషనర్ చెల్లించిన స్టాంప్ డ్యూటీని నాలుగు వారాల్లో చెల్లించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తూ కలెక్టర్ 2025 నవంబర్ 20న బిల్లును ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు సబ్మిట్ చేసి పిటిషనర్లకు టోకెన్ నెంబర్ ఇచ్చారు. కానీ ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవ్ చేయలేదు. విసిగి చెందిన పిటిషనర్ ఫైనాన్స్ సెక్రటరీపై కోర్టు ధిక్కరణ కేసువేశారు. కోర్టు గత జూన్ 19న చివరి అవకాశమిస్తూ స్టాంప్ డ్యూటీ రీఫండ్ పైసలు చెల్లించాలని ఆదేశాలు జారీచేయగా చివరికి పిటిషనర్ కు చెల్లించింది. సుమారు ఐదేళ్ల పాటు తిరిగితే తప్ప బాకీ ఉన్న పైసలు ఇవ్వడం లేదు. ఇలా ధరణి, భూభారతి పోర్టల్ లో స్లాట్ క్యాన్సల్ చేసుకున్నవారు 31,314 మందికి తిరిగి చెల్లించాల్సిన పైసలు రూ.129 కోట్లకు పైగా పెండింగ్ ఉన్నాయి.
కోర్టు ఆదేశాలతో..
గతంలో మేడ్చల్ జిల్లావాసి జక్కుల సుగుణావతి 2022 మే 17న 4 ఎకరాల భూమిని కొనేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. రూ.8,49,522 స్టాంప్ డ్యూటీ కింద చెల్లించారు. కానీ అనివార్య కారణాలతో వెంటనే స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నారు. మూడేళ్లుగా ఆ స్టాంప్ డ్యూటీ రిటర్న్ చేయమని కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. చివరికి విసిగిపోయిన కక్షిదారుడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు తాజాగా పిటిషనర్ చెల్లించిన మొత్తాన్ని నాలుగు వారాల్లో చెల్లించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీచేసింది. నాగిరెడ్డిగూడ సర్వే నం.59ఈ2. 59ఈ3లో 0.10 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. 2023 జూన్ 27న చలానా ద్వారా స్టాంప్ డ్యూటీ రూ.2,25,976 చెల్లించారు. మరుసటి రోజు సేల్ డీడ్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకున్నారు. అదే ఏడాది జులై 20 తేదీ నుంచి చెల్లించిన స్టాంప్ డ్యూటీని తిరిగి ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఎవరూ సరైన రీతిలో స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ సొమ్మును నాలుగు వారాల్లో 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఐదేళ్లుగా పెండింగ్
రాష్ట్రవ్యాప్తంగా 31,314 స్లాట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ సొమ్మంతా సర్కారు ఖజానాకు చేరింది. ఇందులో కేవలం 4,574 కేసుల్లో బాధితులకు తిరిగి ఇచ్చేశారు. ఇంకా 26,740 స్లాట్ల సొమ్ము ఇవ్వాల్సి ఉందని ఇటీవల అసెంబ్లీలో రెవెన్యూశాఖ ప్రకటించింది. ఇందులో 2020–21 నుంచి 2025–26 వరకు కూడా ఉండటం గమనార్హం. రూ.12.97 కోట్లు రిటర్న్ చేశారు. ఇంకా రూ.87.60 కోట్లు ఇవ్వాల్సి ఉంది.






