చిన్నారుల ఊపిరితో చెలగాటం

by velandi.Saikiran |   (  Updated:2026-07-17 23:30:43  IST  )

పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉండాల్సిన పాఠశాల ప్రాంగణం పక్కన ఇప్పుడు ‘కాలుష్య కోరలు’ పంజా విరుస్తున్నాయి.

చిన్నారుల ఊపిరితో చెలగాటం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉండాల్సిన పాఠశాల ప్రాంగణం పక్కన ఇప్పుడు ‘కాలుష్య కోరలు’ పంజా విరుస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్చుకునే ప్రాంతంలో.. ఇప్పుడు కాలుష్యపు విష వలయంలో చిక్కుకోబోతోందా? చిన్నారుల భవిష్యత్తుకు భరోసానివ్వాల్సిన చోట, వారి ఊపిరితో చెలగాటమాడేలా 'ఆర్ఎంసీ' ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పాఠశాలను ఆనుకుని ప్లాంట్ ఏర్పాటుపై తల్లిదండ్రుల ఆవేదన, స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుందిగల్ మున్సిపాలిటీ సర్వే నం. 322 వద్ద స్ఫూర్తి ఫౌండేషన్ పాఠశాలను ఆనుకుని ఆర్ఎంసీ ప్లాంట్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

నిబంధనలు ఏమయ్యాయి ?

సాధారణంగా విద్యాసంస్థలకు దూరంగా పరిశ్రమలు ఉండాలనేది కనీస నిబంధన. అయితే, నిబంధనలను పక్కనపెట్టి నివాస, విద్యా ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్లాంట్ ప్రారంభమైతే వెలు వడే సిమెంట్ ధూళి, భారీ వాహ నాల రాకపోకలతో చిన్నారులకు శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపు ణులు సైతం హెచ్చరిస్తున్నారు.

అధికారుల మౌనం.. ప్రజా ఆందోళన!

ప్రతిరోజూ వందలాది మంది చిన్నారులు చదువుకునే చోట ఇటువంటి పరిశ్రమల ఏర్పాటుపై ఎటువంటి ముందస్తు అధ్యయనం జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్య భద్రత కంటే వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి, తక్షణమే ఈ ప్లాంట్ ఏర్పాటును నిలిపివేయాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Next Story