- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు
రాష్ట్రంలోని డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో ఈ ఏడాది స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో ఈ ఏడాది స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల కంటే ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కాలేజీల్లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ అటానమస్ కళాశాలల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. దీనికి భిన్నంగా ప్రైవేటు కాలేజీల్లో మాత్రం అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ఏకంగా 64 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ నమోదు కాకపోవడం గమనార్హం. అందులో ఒక ప్రభుత్వ కాలేజీ కాగా, 63 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి.
అటానమస్ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రభుత్వ కాలేజీలు కేవలం 25 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, హెల్త్ కేర్ రంగాలకు ప్రాధాన్యత నిస్తూ కొత్తగా 11 కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ విద్యా సంవత్సరం 96 కాలేజీల్లో 24 ఏఈడీపీ కోర్సులను అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 116 కాలేజీల్లో 50,940 సీట్లుంటే 26,016 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ప్రభుత్వ అటానమస్ కాలేజీల సీట్లు హాట్ కేకుల్లా మారాయి. 36 ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో 45,060 సీట్లుంటే, ఏకంగా 39,098 సీట్లు నిండాయి. ఇక 580 ప్రైవేటు కాలేజీల్లో 2,47,040 సీట్లు ఉంటే, 70,471 మంది, ప్రైవేటు అటానమస్ ఐదు కాలేజీల్లో 7,490 సీట్లుంటే 4,162 సీట్లు భర్తీ అయ్యాయి. మూడో విడత కౌన్సెలింగ్ ముగిసినా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 2,13,978 సీట్లు భర్తీ కాలేదు. సుమారు 58 శాతం సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
కామర్స్, సైన్స్ కోర్సులకే డిమాండ్
ఈ ఏడాది కూడా విద్యార్థులు సంప్రదాయ, ఆధునిక కామర్స్, సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపారు. కోర్సుల వారీగా చూస్తే ఈ ఏడాది కూడా కామర్స్ హవా కొనసాగుతోంది. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, బీకామ్ కంప్యూటర్స్ వంటి కోర్సులకు విపరీతమైన పోటీ నెలకొంది. మొత్తం అడ్మిషన్లలో బీకాంలో అత్యధికంగా 52,167 మంది చేరారు. ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్ లో 34,194 మంది, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ లో 28 వేల మంది, బీఏలో 22,704 మంది, బీబీఏలో 11,969 మంది చేరారు. ఆర్ట్స్ కోర్సులతో పోలిస్తే సైన్స్, బిజినెస్ కోర్సుల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఈ కొత్త కోర్సుల్లో 50 శాతానికి పైగా సీట్లు భర్తీ అయినట్లు తెలుస్తోంది.
2 లక్షలకు పైగా సీట్లు ఖాళీ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలో మొత్తం 3.70 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా... ఇప్పటివరకు జరిగిన మూడు విడతల కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా కేవలం 1.50 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే సగానికి పైగా సీట్లు ఇంకా ఖాళీగానే మిగిలిపోయాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల భారం, ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన వసతులు, ఉచిత విద్య లభిస్తుండటంతో విద్యార్థులు ప్రభుత్వ అటానమస్ సీట్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దోస్త్ ప్రత్యేక విడతలో మరికొన్ని సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది.






