ఎలక్టోరల్ బాండ్ల స్కీంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
ఎలక్టోరల్ బాండ్ల స్కీంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇందుకు అవసరమైన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని తెలిపారు. శనివారం ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. ‘‘కోర్టు ఆదేశం ఏదైనా సరే అమలుచేసి తీరుతాం’’ అని స్పష్టం చేశారు. ‘‘ఎలక్టోరల్ బాండ్ల స్కీంకు సంబంధించిన కేసులో మేం కూడా ఒక పక్షంగా ఉన్నాం. మా వైఖరేంటో కోర్టుకు వినిపించాం. ఆ స్కీం అమలులో పారదర్శకత ఉండాలని మేం వాదించాం. కోర్టు నుంచి వచ్చిన తీర్పు ఎలా ఉంటే అలా మేం నడుచుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈసారి ఒడిశాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 37,809 పోలింగ్‌ కేంద్రాలకుగానూ 22,685 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌‌కు ఏర్పాట్లు ఉంటాయి. 300 పోలింగ్‌ కేంద్రాలను వైకల్యం కలిగినవారు, దివ్యాంగులు నిర్వహిస్తారు’’ అని చెప్పారు. భువనేశ్వర్ వేదికగా రాష్ట్రంలోని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్‌లతో ఎన్నిల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు.

Next Story

Most Viewed