రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-30 10:31:47  IST  )

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి ఎగిరిపడటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ తీవ్ర అలజడి రేపింది. చురు జిల్లాలో శనివారం ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం తర్వాత చురు, తారానగర్ తహసీల్, మెహరి గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన ఇసుక తుఫాన్ వచ్చింది. ఫలితంగా గ్రామాలు ఒక్కసారిగా అంధకారమయ్యాయి. దుమ్ము, ధూళి పెద్దఎత్తున కమ్ముకుని రావడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు అరగంట సమయంపాటు ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించగా.. ప్రజలు వణికిపోయారు. కాసేపటికి వాతావరణం మామూలవ్వగా.. భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో సతమతమవుతోన్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్నిచ్చింది. మరో ఐదురోజులపాటు రాజస్థాన్ లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది. బికనీర్, జైపూర్, అజ్మీర్, భరత్‌పూర్, కోట, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వడగండ్ల వాన పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత తగ్గి, ఎండల తీవ్రత నుండి ఉపశమనం లభించనుంది.

కూలిన శతాబ్దాల నాటి వేపచెట్టు.. తప్పిన ప్రమాదం

శుక్రవారం సాయంత్రం వీచిన బలమైన గాలుల ప్రభావం నగరంలో స్పష్టంగా కనిపించింది. అగునా మొహల్లాలోని సంచియా మాతా ఆలయం ముందున్న ఎన్నో ఏళ్ల నాటి భారీ వేపచెట్టు వేళ్లతో సహా పెకలించుకుని రోడ్డుపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ సమయంలో అక్కడ జనం ఉండి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఈ తుఫాను తదనంతరం కురిసిన వర్షం వాతావరణాన్ని మరింత చల్లబరిచింది.

రాజస్థాన్‌లో ప్రకృతి వింత: ఇసుక తుపాన్ తర్వాత కుండపోత వర్షం.. కారణమిదే!

Next Story