బంగారం కొనొద్దు.. మోడీ పిలుపు వెనుక 72 బిలియన్ డాలర్ల ఫారెక్స్ లెక్కలివే!

by Prasad Jukanti |   (  Updated:2026-05-11 08:09:40  IST  )

బంగారం కొనుగోళ్లు ఆపాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు ఇవ్వడంపై తీవ్ర చర్చగా మారింది. ఈ నేపథ్యంలో రేపు జ్యువెలరీ అసోసియేషన్ ప్రధానిని కలవనున్నారు.

బంగారం కొనొద్దు.. మోడీ పిలుపు వెనుక 72 బిలియన్ డాలర్ల ఫారెక్స్ లెక్కలివే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏడాదిపాటు ఎవరూ బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పొదుపు పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, వ్యాపార రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. మోడీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు స్వాగతిస్తున్నారు. అయితే బంగారం కొనుగోళ్లు నిలిపేయాలంటూ ప్రధాని పిలుపునిచ్చిన వేళ జ్యువెలరీ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీన ప్రధానిని కలవాలని నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. బంగారం అంటే కేవలం ఆభరణంగా కాకుండా సెంటిమెంట్‍గా భావించే మన దేశంలో రేపు మోడీతో జరగబోయే భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయేది ఉత్కంఠ రేపుతోంది.

మోడీ పిలుపు వెనుక ఫారెక్స్ లెక్కలు:

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల కారణంగా వస్తువుల ధరలు పెరగడం, అంతర్జాతీయ సరఫరా గొలుసులలో పెరుగుతున్న ఒడిదుడుకుల కారణంగా భారతదేశం విదేశీ మారక నిల్వల విషయంలో ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఇటువంటి తరుణంలో నిన్న తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని ఇచ్చిన ఈ పొదుపు మార్గం ఆసక్తిని రేపుతోంది. అయితే మోడీ పిలుపు వెనుక ఉన్న ఫారెక్స్ లెక్కలు ఏంటో చూద్దాం..

72 బిలియన్ డాలర్ల గోల్డ్ ఇంపోర్ట్:

ట్రేడింగ్ ఎకనామిక్స్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 690.69 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు (విదేశీ మారక నిల్వలు) ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇవి 728 బిలియన్ డాలర్లకు చేరుకోగా అంతర్జాతీయ అస్థిరత కారణంగా ఏప్రిల్ నాటికి 691 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. మరోవైపు 2026 నాటికి భారత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD) 84.5 బిలియన్ డాలర్లకు (జీడీపీలో 2 శాతం) చేరుతుందని ఐఎంఎఫ్ (IMF) అంచనా వేసింది. అయితే బంగారం దిగుమతులే ఈ లోటుకు ప్రధాన కారణం. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 24 శాతం అధికం కావడం గమనార్హం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారు మన దేశమే కావడం మరో విశేషం.

మొత్తం దిగుమతుల్లో కీలక వాటా

2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం దిగుమతుల బిల్లు 775 బిలియన్ డాలర్లు కాగా అందులో కేవలం నాలుగు వస్తువులకే 240 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇందులో ముడి చమురు కోసం 134.7 బిలియన్ డాలర్లు, బంగారం కోసం 72 బిలియన్ డాలర్లు, వంట నూనెల కోసం 19.5 బిలియన్ డాలర్లు, ఎరువుల కోసం 14.5 బిలియన్ డాలర్లు వెచ్చించారు. మొత్తం దిగుమతుల్లో బంగారం వాటానే దాదాపు 10 శాతంగా ఉండగా బంగారం డిమాండ్ 30-40 శాతం తగ్గితే 20-25 బిలియన్ డాలర్లను, 50 శాతం తగ్గితే 36 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలను ఆదా చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

రూపాయి పతనం ఓ సమస్య:

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడి చమురు ధరలు ఆకాశానంటుతున్నాయి. యుద్ధ సమయంలో ప్రజలు సురక్షిత పెట్టుబడిగా భావించి బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇది డాలర్ల అవుట్‌ఫ్లోను పెంచి రూపాయిని బలహీనపరుస్తుంది. ఈ తరుణంలో బంగారం కొనుగోలును నిలిపివేయడం అనేది భయాందోళనతో కాకుండా ఒక రక్షణాత్మక ఆర్థిక వ్యూహమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే మోడీ పొదుపు మంత్రానికి పిలుపు ఇచ్చారనే చర్చ జరుగుతోంది.

సోమనాథ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. 75వ వార్షికోత్సవంలో ఉద్వేగపూరిత ప్రసంగం

Next Story