బడ్జెట్ సమావేశాలు ముగింపు.. లోక్‌సభ నిరవధిక వాయిదా

by Malleboina Mahesh |   (  Updated:2026-04-18 08:26:30  IST  )

లోక్‌సభ నిరవధిక వాయిదా! 2026 బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఉత్కంఠ, అమరావతి బిల్లు ఆమోదం పొందడం ఈ సెషన్‌లో ముఖ్యాంశాలు.

బడ్జెట్ సమావేశాలు ముగింపు.. లోక్‌సభ నిరవధిక వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్‌లో జనవరి 28న ప్రారంభమైన 2026-27 బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సమావేశాలు భారత రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 53.47 లక్షల కోట్ల వ్యయంతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు ఇందులో పెద్దపీట వేశారు. సమావేశాల చివరి దశలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం, విపక్షాల మధ్య జరిగిన పోరు ఈ సెషన్‌కు కేంద్రబిందువుగా నిలిచింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 ద్వారా అమరావతి రాజధానిగా మరింత స్పష్టత లభించగా, వ్యాపార లావాదేవీల సరళీకరణ కోసం జన్ విశ్వాస్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

అయితే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చల సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గుతుందనే ఆందోళనతో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాయి. దీంతో సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. దీంతో డీలిమిటేషన్‌, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. మూడో రోజు శనివారం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో మూడో రోజు ఎటువంటి చర్చలు లేకుండా సభ వాయిదా పడింది. దీంతో సుమారు మూడు నెలల పాటు సాగిన ఈ సుదీర్ఘ బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ముగిశాయి.

విపక్షాలకు మహిళా సాధికారత ఇష్టం లేదు.. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్

Next Story