రాజీనామాకు సిద్ధమైన ముఖ్యమంత్రి.. రాజ్యసభకు నామినేషన్..

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-05 14:56:59  IST  )

బిహార్ రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది.

రాజీనామాకు సిద్ధమైన ముఖ్యమంత్రి.. రాజ్యసభకు నామినేషన్..
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్(CM Nitish Kumar) రాజ్యసభకు నామినేషన్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న నితీష్ కుమార్, అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. బిహార్ శాసనసభ కోటాలో రాజ్యసభ సభ్యత్వానికి ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఎన్డీఏ (NDA) కూటమి అభ్యర్థులతో కలిసి నితీష్ కుమార్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీష్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జేడీయూ నాయకుడు రామ్‌నాథ్ ఠాకూర్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత ఉపేంద్ర కుష్వాహా కూడా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు.

నాలుగు సభల కోరిక తీరింది: నితీష్

నామినేషన్ అనంతరం నితీష్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన మనసులోని మాటను బయటపెట్టారు. "నా రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి, ఉభయ సభలు (శాసనసభ, మండలి) మరియు పార్లమెంటులోని రెండు సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యుడిగా ఉండాలన్నది నా చిరకాల కోరిక. ఈ రాజ్యసభ ఎన్నికతో నా ఆకాంక్ష నెరవేరుతోంది. బిహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు ఉంటుంది," అని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ ఒత్తిడితోనే ఈ నిర్ణయం: తేజస్వి యాదవ్

మరోవైపు, నితీష్ కుమార్ నిర్ణయంపై ప్రతిపక్ష ఆర్జేడీ (RJD) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇది నితీష్ కుమార్ స్వచ్ఛంద నిర్ణయం కాదని, బీజేపీ ఒత్తిడి మేరకే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నారని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. 'బిహార్‌లో బీజేపీ' మహారాష్ట్ర మోడల్'ను అమలు చేస్తోంది. మిత్రపక్షాలను బలహీనపరచడం బీజేపీకి అలవాటే. నితీష్ కుమార్‌ను బలవంతంగా రాజ్యసభకు పంపి, రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారు," అని తేజస్వి విమర్శించారు.

ముగియనున్న ఒక శకం?

నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్‌లో నాయకత్వ మార్పు తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ నిష్క్రమణతో బిహార్ రాజకీయాల్లో ఒక శకం ముగియనుందా అన్న చర్చ మొదలైంది.

నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Next Story