తలకిందులుగా వేలాడదీసి, బుద్ధి చెబుతాం : టీఎంసీ నేతలకు అమిత్‌ షా తీవ్ర హెచ్చరిక

by Ramesh Naini |   (  Updated:2026-04-21 12:39:08  IST  )

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.

తలకిందులుగా వేలాడదీసి, బుద్ధి చెబుతాం : టీఎంసీ నేతలకు అమిత్‌ షా తీవ్ర హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం డార్జిలింగ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మే 5 తర్వాత బెంగాల్ పౌరులను, ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెడితే టీఎంసీ గూండాలను తలకిందులుగా వేలాడదీసి, సరిచేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మమతా దీదీకి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ సభలో అమిత్ షా బెంగాల్ ఓటర్లపై వరాల జల్లు కురిపించడంతో పాటు, మమత సర్కారుపై కీలక ఆరోపణలు చేశారు.

గూర్ఖాల సమస్య పరిష్కారం..

‘బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలు, నిరుద్యోగ యువత ఖాతాల్లో ప్రతి నెలా రూ. 3,000 చొప్పున జమ చేస్తాం. తేయాకు తోటల్లో పాఠశాలల నిర్మాణం చేపడతాం. కార్మికులకు భూమి పట్టాలు ఇచ్చి యజమానులను చేస్తాం. రాబోయే రెండేళ్లలో వారి వేతనాన్ని రూ.500కు పైగా పెంచుతాం. దశాబ్దాలుగా ఉన్న గూర్ఖాల సమస్య పరిష్కారానికి కేంద్రం మూడు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా మమత ప్రభుత్వం సహకరించలేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే గూర్ఖాల ఆకాంక్షల మేరకు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.’ అని ప్రధాన హామీలు అమిత్ షా వివరించారు.

మమత సర్కారుపై విమర్శలు..

గిరిజనులు, ఉత్తర బెంగాల్, డార్జిలింగ్ ప్రాంతాల అభివృద్ధికి కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించిన మమత సర్కార్.. మదర్సాలు, ముస్లింల కోసం ఏకంగా రూ. 5,700 కోట్లు కేటాయించి తీవ్ర వివక్ష చూపుతోందని ఆరోపించారు. సందేశ్‌ఖాలీ ఘటన యావత్ బెంగాల్‌కే అవమానకరమని, టీఎంసీ పాలనలో మహిళలపై అకృత్యాలు పెరిగాయని, బీజేపీ అధికారంలోకి వస్తే నిందితులను ఏరికోరి జైలుకు పంపుతామని అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) నిర్వహించనున్నారు. 2011 నుంచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుండగా, బీజేపీని ‘బయటి వ్యక్తుల పార్టీ’గా ముద్ర వేస్తూ టీఎంసీ తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.

ప్రధాని మోడీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘ఉగ్రవాది’ అని.. ఆపై వివరణ!

Next Story