- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
పాలేరు నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ప్రజలకు వాటి ఫలాలు త్వరితగతిన అందేలా అధికారులు పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, కూసుమంచి : పాలేరు నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ప్రజలకు వాటి ఫలాలు త్వరితగతిన అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న నిర్మాణ, మౌలిక వసతుల పనులను ఇంజినీరింగ్ శాఖల వారీగా సమీక్షించారు. ఇప్పటివరకు మంజూరైన పనులు, టెండర్ ప్రక్రియ పూర్తైన పనులు, క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులు, ఇంకా టెండర్ దశలో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెండర్ ప్రక్రియ నిలిచిపోయిన పనులకు ఉన్న అడ్డంకులను తొలగించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా కార్యాచరణ చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లుల వివరాలను కూడా సమర్పించాలని సూచించారు.
వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండటం అభివృద్ధి పనుల వేగానికి ఎంతో అవసరమని పేర్కొన్న మంత్రి, సమస్యలు తలెత్తిన వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజాదర్బార్‌లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలో రీ-సర్వే ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపట్టాలని, రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్ రావు, పీఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.






