అమెరికా పర్యాటకురాలిపై హోం స్టే సిబ్బంది అత్యాచారం.. రంగంలోకి యూఎస్ కాన్సులేట్

by Prasad Jukanti |   (  Updated:2026-04-22 06:31:25  IST  )

కర్ణాటకలోని కొడగులో అమెరికా పర్యాటకురాలిపై హోమ్‌స్టే సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అమెరికా పర్యాటకురాలిపై హోం స్టే సిబ్బంది అత్యాచారం..  రంగంలోకి యూఎస్ కాన్సులేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ టూరిజం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ప్రపంచ పర్యాటకులు భారత్‍లోని వివిధ దర్శనీయ ప్రదేశాలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటువంటి తరుణంలో కొంతమంది చేస్తున్న నీచపనుల వల్ల ప్రపంచ దేశాల ముందు మన దేశం పరువు బజారుపాలవుతోంది. తాజాగా కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొడగు జిల్లాలో అమెరికాకు చెందిన ఓ మహిళా పర్యాటకురాలిపై హోమ్‌స్టే సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా హోమ్‌స్టే యజమాని ఆమెను గదిలో బంధించి ఇతరులతో ఆమె సంప్రదింపులు జరపకుండా వైఫై సేవలు నిలిపివేశారు. ఈ ఘటనలో హోమ్ స్టే లో పని చేస్తున్న జార్ఖండ్ కు చెందిన వృజేశ్ కుమార్ అనే నిందితుడితో పాటు హోమ్ స్టే యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

అమెరికా రాయబార కార్యాలయం ఎంట్రీ:

బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆమెను అక్కడే నిర్భందించారు. తిరిగి వైఫై యాక్సెస్ పొందిన అనంతరం మైసూర్ వెళ్తున్నాననే నెపంతో బాధితురాలు ఆ ప్రాంగణం నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఈ ఘటనపై అమెరికా రాయబార కార్యాలయానికి తెలియజేసింది. ఈ వ్యవహారంపై అమెరికా అధికారులు మైసూర్‍లోని పోలీసు అధికారులను ఈమెయిల్ ద్వారా సంప్రదించగా పోలీసుల కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి మే 3 వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించామని తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

గతేడాది ఇజ్రాయెల్ యువతిపై..

కాగా ఇదే కర్ణాటకలో గత ఏడాది మే లో ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన పర్యటకుల దాడితో పాటు అత్యాచారం కలకలం రేపింది. గంగావతి ప్రాంతంలో రాత్రి పర్యటకులు సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించగా కొందరు దుండగులు ఆ ప్రాంతానికి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‍కు చెందిన ఓ యువతి, మరో మహిళపై ముగ్గురు దుండగులు దాడితో పాటు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితులు కొప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విదేశీయులపై కర్ణాటకలో వరుస దాడులు, అత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

భర్త‌ను చంపేందుకు ప్రియుడితో పక్కా స్కెచ్: తీరా చూస్తే.. సీన్ అంతా రివర్స్!

Next Story