పవార్ సతీమణి చేతికి ఎన్సీపీ? తొలిసారి చక్రం తిప్పనున్న మహిళ?

by Phanindra |   (  Updated:2026-01-29 05:23:40  IST  )

పవార్ సతీమణి చేతికి ఎన్సీపీ పగ్గాలు వచ్చే అవకాశం. అదే జరిగితే మహారాష్ట్రలో తొలిసారి చక్రం తిప్పనున్న మహిళ?

పవార్ సతీమణి చేతికి ఎన్సీపీ? తొలిసారి చక్రం తిప్పనున్న మహిళ?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత దేశ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామాలు జరిగే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఆ రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరగడం అందరికీ తెలిసిందే. మహాయుతి కూటమి ఏర్పడటంతో అక్కడ రాజకీయాలకు కొంత కుదుట పడినట్లే కనిపించాయి. ఇలాంటి సమయంలో ఫ్లయిట్ క్రాష్‌లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలవడం ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దీంతో ఇప్పుడు ఎన్సీపీ ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీలో బడా నేతలకు కొదవేం లేదు. ఎన్సీపీ మాజీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ఓబీసీ నేత ఛగన్ భుజ్‌బల్ వంటి వారు అజిత్ పవార్ స్థానాన్ని తీసుకొని, పార్టీని సమర్థవంతంగా నడిపించగల వారే. అయితే వీరందరినీ కాదని అజిత్ పవార్ భార్య సునేత్రకు పార్టీ పగ్గాలు దక్కినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే ఇప్పటి వరకు పురుషుల ఆధిపత్యం నడిచిన మహారాష్ట్ర రాజకీయాల్లో ఆమె ‘అమ్మగారు’గా మారే అవకాశం ఉంది.

ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర..

వ్యవసాయ-రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబానికి చెందిన సునేత్ర.. సోషల్ వర్కర్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా, అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎన్నో రంగాల్లో పనిచేశారు. ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా భర్త పనిచేసినా కూడా.. రాజకీయాల్లో సునేత్ర ముందుకు రాలేదు. అదే సమయంలో సొంతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. బారామతి టెక్స్‌టైల్ కంపెనీ చైర్‌పర్సన్‌గా సేవలందిస్తున్న ఆమె.. ఎన్విరాన్‌మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా అనే పర్యావరణం కోసం పోరాడే ఎన్జీవోను కూడా నడిపిస్తున్నారు. ఈ రంగంలో ఆమె చేసిన సేవకు ‘గ్రీన్ వారియర్ అవార్డ్’ కూడా అందుకున్నారు. 2011 నుంచి ఫ్రాన్స్‌లోని వరల్డ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ ఫోరంలో థింక్ ట్యాంక్ మెంబర్‌గా ప్రపంచ బిజినెస్ రంగంపై కొత్త ఆలోచనలను పంచుకుంటూ వస్తున్నారు. అజిత్ పవార్ ప్రారంభించిన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ‘విద్యా ప్రతిష్ఠన్’లో ట్రస్టీగా ఉన్నారు. అలాగే 2017 నుంచి సావిత్రిబాయి ఫూలే పూనే యూనివర్సిటీలో సెనేట్ మెంబర్‌గా పాలసీలు నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇలా పలురంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

రాజకీయ రంగప్రవేశం..

మహారాష్ట్ర రాజకీయాలతో విడదీయలేని అనుబంధం ఉన్న పవార్ కుటుంబంలో ఉన్నా కూడా రాజకీయాల వైపు సునేత్ర అడుగులు వేయలేదు. అయినా సరే ఆమెకు బారామతి, మరాఠావాడ్ ప్రాంతాల్లో బలమైన నెట్‌వర్క్ ఉండటం గమనార్హం. శరద్ పవార్, అజిత్ పవార్ విడిపోయిన తర్వాత అజిత్ సోదరి సుప్రియా సూలేపై బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1.5 లక్షల ఓట్ల తేడాతో సునేత్ర ఓటమిపాలయ్యారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రఫుల్ పటేల్ స్థానంలో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

మహారాష్ట్రలో మహిళా నేత?

ఇప్పటి వరకు మహారాష్ట్ర రాజకీయాల్లో పురుషాధిక్యమే కొనసాగింది. అద్భుతమైన సలహాదారులుగా మహిళలు కనిపించినా.. ముందుండి నాయకత్వం వహించిన సందర్భాలు చాలా తక్కువ. పెద్ద నేతలుగా సుప్రియా సూలే వంటి వారు ఉన్నా.. అధికారం మాత్రం వారి చేతుల్లోకి రాలేదు. అలాంటిది ఇప్పుడు అజిత్ పవార్ పక్షమైన ఎన్సీపీ పూర్తిగా సునేత్ర చేతుల్లోకి వెళ్తే.. ఆమె రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని విశ్లేషకుల భావన. ప్రస్తుతం అధికార మహాయుతిలో ఎన్సీపీ (41 సీట్లు) ప్రభావం తక్కువైనా.. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయో తెలియదు. అయితే ప్రఫుల్ పటేల్, భుజ్‌బల్‌తోపాటు సునేత్ర కుమారుడు పార్థ్ పవార్, మేనల్లుడు రోహిత్ పవార్ కూడా ఎన్సీపీ పగ్గాల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. కానీ అజిత్ పవార్ యాక్సిడెంట్ తర్వాత మహారాష్ట్ర ప్రజల్లో సునేత్రపై వచ్చే భావోద్వేగాలు, మద్దతును మరే నేత కూడా సంపాదించలేడనేది కాదనలేని సత్యం. ఇప్పటికే బారామతిలో బలమైన పట్టున్న ఆమె.. పార్టీ పగ్గాలు అందుకుంటే భవిష్యత్తులో ఎన్సీపీని రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రంగా మార్చే అవకాశం ఉంది. అయితే అజిత్, శరద్ పవార్‌ల పక్షాలు కలిసిపోవాలని చర్చలు జరుగున్నాయనే వార్తల నేపథ్యంలో.. ఎన్సీపీ సునేత్రకు దక్కుతుందా? లేక తిరిగి అందరూ కలిసి శరద్ పవార్‌ను ఆశ్రయిస్తారా? అన్నది చూడాలి.

Similar News : బారామతి విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

Next Story