మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. మోస్ట్ వాంటెట్ నేత పాపారావు సరెండర్?

by Prasad Jukanti |   (  Updated:2026-03-11 14:51:06  IST  )

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఆయుధాలతో సరెండర్ కాబోతున్నారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు ఉన్నట్లు తెలుస్తోంది.

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. మోస్ట్ వాంటెట్ నేత పాపారావు సరెండర్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముంచుకొస్తున్న ఆపరేషన్ కగార్ (Operation Kagaar) డెడ్ లైన్, కీలక నేతల వరుస సరెండర్లతో సతమతం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన 108 మంది మావోయిస్టులు బుధవారం ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) జగదల్‌పూర్‌లోని బస్తర్ డివిజనల్ ప్రధాన కార్యాలయంలో సరెండర్ కాబోతున్నారు. వీరితో పాటు భారీగా ఆయుధాల డంప్‍ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాల డంప్‍ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఈ ఆయుధాలను జగదల్‌పూర్‌లోని లాల్‌బాగ్ పోలీస్ కోఆర్డినేషన్ సెంటర్‌లో జరిగే లొంగుబాటు కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు.

మావోయిస్టుల సమాచారంతోనే:

లొంగిపోవాలని నిర్ణయించుకున్న మావోయిస్టులు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా బస్తర్ రేంజ్ వ్యాప్తంగా (బీజాపూర్ జిల్లాలో) భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలతో పాటు ఇతర మావోయిస్టు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరికాసేపట్లో రాష్ట్ర డీజీపీ, ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన పెద్దలు, కేంద్ర, రాష్ట్ర భద్రతాదళాల ఉన్నతాధికారుల సమక్షంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవబోతున్నారు. ఆపరేషన్ కగారులో భాగంగా ఈ నెల 31 వ తేదీలోపు దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కేంద్రం కంకణం కట్టుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పునా మార్గెమ్ కార్యక్రమం ద్వారా మావోయిస్టులను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చి వారికి పునరావాసం, జీవనోపాధి కల్పించడంపై దృష్టి సారించారు.

సరెండర్ అయిన వారిలో పాపారావు?:

ఇవాళ సరెండర్ అవుతున్న వారిలో మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత, టాప్ కమాండర్ పాపారావు మోంగు (Papa Rao) ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దఎత్తున మావోయిస్టులకు చెందిన ఆయుధాల డంప్‍ను స్వాధీనం చేసుకోవడం, ప్రస్తుతం భారీ స్థాయిలో ఆయుధాలు పాపారావు టీమ్ వద్దే ఉన్నట్లు ప్రచారం ఉండటంతో తాజా లొంగుబాటులో పాపారావు కూడా ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఛత్తీస్‍గఢ్‌లోని కిష్టారం ప్రాంతానికి చెందిన పాపారావు.. మాడ్వి హిడ్మా బార్సె దేవా తర్వాత దక్షిణ బస్తర్‌లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఇతడు ఒకడిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్‍లో ఉన్న మావోయిస్టు క్యాడర్లపై పాపారావుకు గట్టి పట్టు ఉంది. దీంతో గత కొంతకాలంగా 'ఆపరేషన్ పాపారావు' (Operation Papa Rao) పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్ గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో పలు సందర్భాల్లో జరిగిన ఎదురుకాల్పల నుంచి ఆయన తృటిలో తప్పించుకుంటున్నారు. అయితే తాజాగా ఆయుధాల నిల్వలు స్వాధీనం చేసుకోవడం, 108 మంది మావోయిస్టులు సరెండర్ కాబోతున్న తరుణంలో వీరిలో పాపారావు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బస్తర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఒకేసారి 108 మంది సరెండర్

Next Story