పేదవారు పిల్లలను కనడంపై వరలక్ష్మీ శరత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-13 09:06:59  IST  )

చాలామంది తమ పిల్లల చదువుల కోసం నా దగ్గరకు వచ్చి సహాయం అడుగుతుంటారు. నేనేమైనా వారికి జన్మనిచ్చానా? మీ తప్పులకు నేను ఎందుకు సహాయం చేయాలి?

పేదవారు పిల్లలను కనడంపై వరలక్ష్మీ శరత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: స్టార్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా పిల్లలను కనడం, ఆర్థిక స్థోమతపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు నెటిజన్లకు ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ.. "మన దేశంలో సెక్స్ గురించి ఎవరూ మాట్లాడరు కానీ, జనాభాలో మాత్రం మనం నంబర్ వన్. అందరూ పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధపడతారు. అసలు మిమ్మల్ని పిల్లలను కనమని ఎవరు అడిగారు? కనే ముందే ప్లాన్ చేసుకోవాలి కదా" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

తాను పిల్లలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే.. "ప్రస్తుత కాలంలో పిల్లలను పెంచడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలామంది తమ పిల్లల చదువుల కోసం నా దగ్గరకు వచ్చి సహాయం అడుగుతుంటారు. నేనేమైనా వారికి జన్మనిచ్చానా? మీ తప్పులకు నేను ఎందుకు సహాయం చేయాలి? కనీసం ఇంకొకరిని పోషించే స్తోమత ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పిల్లలను కనండి" అని ఆమె నిర్మొహమాటంగా చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో పక్కనే ఉన్న నటి ప్రియమణి, మంచు లక్ష్మి కూడా వరలక్ష్మీకి సపోర్ట్ చేస్తూ క్లాప్స్ ఎమోజీలను షేర్ చేశారు.

ఇక వరలక్ష్మీ చేసిన వ్యాఖ్యల విషయంలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. "డబ్బున్న వాళ్ళే పిల్లలను కనాలనడం అహంకారమే. 40 ఏళ్లలో ఆర్థికంగా సెటిల్ అయ్యాక పిల్లలు పుడతారన్న గ్యారెంటీ ఏంటి?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పేదవాడికి పిల్లలను కనే హక్కు లేదని చెప్పడం ఆమె అహంభావానికి నిదర్శనం" అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన ప్రముఖ నటి.. చర్చనీయాంశంగా మారిన వీడియో

Next Story