రామ్ చరణ్ 'పెద్ది'పై రవిబాబు ఫైర్.. పెద్ద చిత్రాల వల్ల చిన్న సినిమాలు బలి కావాలా?

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-02 05:25:12  IST  )

మేము మొదట 'రేజర్' మూవీని మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ అదే సమయంలో 'పెద్ది' వంటి పెద్ద చిత్రం వస్తుందని మార్కెట్‌లో విపరీతమైన హడావిడి చేశారు.

రామ్ చరణ్ పెద్దిపై రవిబాబు ఫైర్.. పెద్ద చిత్రాల వల్ల చిన్న సినిమాలు బలి కావాలా?
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రం విడుదల తేదీ తరచుగా మారుతుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో ఇతర సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సీనియర్ దర్శకుడు, నటుడు రవిబాబు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘రేజర్’ మే 8న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద చిత్రాల విడుదల తేదీల విషయంలో జరుగుతున్న అయోమయం వల్ల చిన్న సినిమాలు ఎంతలా ఇబ్బంది పడుతున్నాయో వివరించారు. "మేము మొదట 'రేజర్' మూవీని మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ అదే సమయంలో 'పెద్ది' వంటి పెద్ద చిత్రం వస్తుందని మార్కెట్‌లో విపరీతమైన హడావిడి చేశారు. పెద్ద సినిమా వస్తుందంటే థియేటర్లు దొరకవు, కలెక్షన్లు రావు అని భయపెట్టారు" అని రవిబాబు అన్నారు. పెద్ద చిత్రాల నిర్మాతలు ఒక తేదీ ప్రకటించి, మళ్ళీ వెనక్కి తగ్గడం వల్ల చిన్న సినిమాల మేకర్స్ అయోమయంలో పడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

"ఆ పెద్ద చిత్రాలు అంతే.. ఒక తేదీ చెప్తారు, కానీ ఆ సమయానికి రారు. వారి వల్ల చిన్న సినిమాలు అటు ఇటు పరిగెత్తాల్సి వస్తోంది. 'పెద్ది' వస్తుంది అన్నారు, మళ్ళీ వాయిదా పడింది అన్నారు, మళ్ళీ వస్తుంది అన్నారు.. ఇలా ఒక 15 రోజుల పాటు రిలీజ్ డేట్ విషయంలో నేను చాలా నరకం అనుభవించాను. చివరికి ఆ పెద్ద సినిమా రాదని తేలడంతో, మా నాన్న చలపతి రావు గారి పుట్టినరోజు మే 8న ఉండటంతో ఆ రోజునే ‘రేజర్’ను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాను" అని రవిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద సినిమాలు సరైన ప్లానింగ్ లేకుండా విడుదల తేదీలు మార్చడం వల్ల పబ్లిసిటీ ఖర్చులు వృధా అవుతాయని, చిన్న నిర్మాతలకు ఇది పెద్ద భారమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రవిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద సినిమాల నీడలో చిన్న చిత్రాలు నలిగిపోతున్నాయనేది ఆయన ఉద్దేశం. ఏదేమైనా, 'పెద్ది' సినిమా జూన్ 4న వస్తుందని మేకర్స్ చెప్పినా, దాని చుట్టూ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు రవిబాబు తన ‘రేజర్’ మూవీ మే 8న ప్రేక్షకుల తీర్పును అందుకోవడానికి సిద్ధమయ్యారు.

షూటింగ్ సెట్‌లో 10 సార్లు అసభ్యంగా తాకాడు.. డైరెక్టర్ సనోజ్ మిశ్రాకు షాకిచ్చిన కుంభమేళా బ్యూటీ

Next Story