షూటింగ్ సెట్‌లో 10 సార్లు అసభ్యంగా తాకాడు.. డైరెక్టర్ సనోజ్ మిశ్రాకు షాకిచ్చిన కుంభమేళా బ్యూటీ

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-02 05:24:29  IST  )

‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా ఆరోపించారు.

షూటింగ్ సెట్‌లో 10 సార్లు అసభ్యంగా తాకాడు.. డైరెక్టర్ సనోజ్ మిశ్రాకు షాకిచ్చిన కుంభమేళా బ్యూటీ
X

దిశ, సినిమా: కుంభమేళా గర్ల్‌గా పాపులర్ అయిన మోనాలిసా భోస్లే వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనను లైంగికంగా వేధించారంటూ ఆమె ఏకంగా ఒక సినిమా దర్శకుడిపై, అలాగే మరో నలుగురిపై పోక్సో (POCSO) చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా ఆరోపించారు. కొచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. షూటింగ్ సెట్‌లో దర్శకుడు తనను పదిసార్లు అభ్యంతరకరంగా తాకారని వెల్లడించారు. ఈ విషయాన్ని తన ఇంట్లో చెబితే వారు తనకు అండగా నిలవలేదని, అందుకే చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ కేసులో కేవలం దర్శకుడే కాకుండా, విహెచ్‌పి నాయకుడు, న్యాయవాది అయిన అనిల్ విలయిల్ పై కూడా మోనాలిసా ఫిర్యాదు చేశారు. ఆయన సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారని ఆమె పేర్కొన్నారు. గురువారం కోర్టుకు హాజరైన మోనాలిసా, తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అయితే ఈ ఘటనలు మధ్యప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తుండటంతో, కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.కాగా.. మోనాలిసా జీవితంలో మరో పెద్ద వివాదం ఆమె పెళ్లి. ఆమె ఫర్మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా, ఆమె కుటుంబ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోనాలిసా ఇంకా మైనర్ అని, ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని వారు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సనోజ్ మిశ్రా కూడా ఆమె పెళ్లిని లవ్ జీహాద్‌గా పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే అతనిపై ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే మోనాలిసా మాత్రం తనకు 18 ఏళ్లు నిండాయని, తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నానని వాదిస్తున్నారు. ఈ కేసులో 'లవ్ జిహాద్' కోణాలు కూడా ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.

ఆ డైరెక్టర్ తన ముందే బట్టలు మార్చుకోమన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్నేషనల్ కామెంట్స్

Next Story