పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రాశీ ఖన్నా.. ఈ పాత్ర చాలా ప్రత్యేకమంటూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-03 06:51:15  IST  )

నేను ఇప్పటివరకు ఎన్నో భాషల్లో, ఎన్నో రకాల పాత్రలు చేసినప్పటికీ, ఈ గుర్బానీ పాత్ర నాకు చాలా ప్రత్యేకం.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రాశీ ఖన్నా.. ఈ పాత్ర చాలా ప్రత్యేకమంటూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అందాల నటి రాశీ ఖన్నా, ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఆమెకు ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేకపోయింది. అయితే, ఈ పరాజయాలకు ఏమాత్రం నిరాశ చెందకుండా, రాశీ తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా ఆమె ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమైంది.వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన ముద్ర వేయాలని చూస్తున్న రాశీ ఇప్పుడు ‘లుఖ్కే’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో అలరించబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. హిమాంక్ గౌర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అక్కడి డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసే ఒక ఇంటెన్స్ పోలీస్ డ్రామాగా దీనిని రూపొందించారు. ఇందులో రాశీతో పాటు పాలక్ తివారీ ఒక కీలక పాత్రలో నటించడం విశేషం.

ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. "ఈ సిరీస్‌లో నేను గుర్బానీ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాను. నేను ఇప్పటివరకు ఎన్నో భాషల్లో, ఎన్నో రకాల పాత్రలు చేసినప్పటికీ, ఈ గుర్బానీ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే నా మూలాలు పంజాబీలోనే ఉన్నాయి, ఈ పాత్ర కూడా పంజాబీ నేపథ్యం ఉన్నది కావడంతో నాకు ఇది సొంత ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతిని ఇచ్చింది" అని ఆమె పేర్కొంది. కథలో గుర్బానీ పాత్ర చాలా బలంగా ఉంటుందని రాశీ వివరించింది. "ఈ పాత్రలో కేవలం గాంభీర్యమే కాదు, ఎన్నో ఎమోషన్స్, భిన్నమైన కోణాలు దాగి ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్‌గా డ్రగ్స్ మాఫియాపై పోరాడుతూనే, తన వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలను ఎలా ఎదుర్కొంటుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి ఒక ఇంటెన్స్ రోల్‌లో నటించడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది" అని రాశీ ధీమా వ్యక్తం చేసింది. మరి ఈ పంజాబీ పోలీస్ ఆఫీసర్ పాత్ర రాశీ ఖన్నాకు కెరీర్ బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. యాక్షన్ సిక్వెన్స్‌తో బాక్సాఫీసు షేక్ అవడం ఖాయం

Next Story