పవన్‌ ఎంట్రీ సీన్‌పై ట్రోల్స్.. ట్రోలర్స్‌కు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-27 06:48:24  IST  )

నేను కొన్ని సన్నివేశాల్లో మేకింగ్ పరంగా స్వేచ్ఛ తీసుకుంటాను. ఆ రెండు షాట్లు నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి నేను తీశాను, ఇంకోటి మాస్టర్ తీశారు.

పవన్‌ ఎంట్రీ సీన్‌పై ట్రోల్స్.. ట్రోలర్స్‌కు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య ఉగాది కానుకగా విడుదలైన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో పాటు, సోషల్ మీడియాలో నెటిజన్లు లాజిక్కుల విషయంలో హరీష్ శంకర్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, తనపై వస్తున్న విమర్శలకు హరీష్ శంకర్ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జీపులో నుంచి పవన్ దిగేటప్పుడు ఒకసారి బాడీ పడుతుండగా దిగడం, మళ్ళీ అదే జీపు నుండి జంప్ చేయడంపై నెటిజన్లు "ఒకే మనిషి రెండుసార్లు ఎలా దిగుతాడు?" అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. "నేను కొన్ని సన్నివేశాల్లో మేకింగ్ పరంగా స్వేచ్ఛ తీసుకుంటాను. ఆ రెండు షాట్లు నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి నేను తీశాను, ఇంకోటి మాస్టర్ తీశారు. అవి బాగున్నప్పుడు లాజిక్కులను నేను అస్సలు పట్టించుకోను" అని అన్నారు.

తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నేను ఇన్నేళ్లలో కేవలం తొమ్మిది సినిమాలే చేశాను. కానీ దాదాపు 10 ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్‌తో ‘ఎంఎల్‌ఏ’ (MLA) అనే సినిమా చేయాలనుకున్నాను. కానీ అది కుదరలేదు. కొన్నిసార్లు స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడం వల్ల, మరికొన్నిసార్లు హీరోలు చివరి నిమిషంలో తప్పుకోవడం వల్ల చాలా సినిమాలు పట్టాలెక్కలేదు. వర్క్ చేసి కూడా ఆగిపోయిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇకపై జరగనివ్వనని హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. "ఇక నుంచి వరుసగా సినిమాలు చేస్తాను. నా దగ్గర చాలా కథలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా వాటిని సెట్స్ పైకి తీసుకెళ్తాను" అని ఆయన చెప్పుకొచ్చారు. హరీష్ ఇచ్చిన ఈ వివరణ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. డైరెక్టర్ కౌంటర్ అదిరిపోయింది.. లాజిక్కుల కంటే హీరో ఎలివేషన్ ముఖ్యం" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హరీష్ శంకర్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Ram Charan: గ్లోబల్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న ‘పెద్ది’ గ్లింప్స్

Next Story