సాయాజీ షిండే చేసిన పనికి నెటిజన్లు షాక్.. గ్రేట్ హీరో అంటూ ప్రశంసల వర్షం!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-05 10:54:15  IST  )

సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించే సాయాజీ షిండే, నిజజీవితంలో ఎంతటి సున్నిత మనస్కుడో మరోసారి నిరూపించుకున్నారు.

సాయాజీ షిండే చేసిన పనికి నెటిజన్లు షాక్.. గ్రేట్ హీరో అంటూ ప్రశంసల వర్షం!
X

దిశ, సినిమా: సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించే సాయాజీ షిండే, నిజజీవితంలో ఎంతటి సున్నిత మనస్కుడో మరోసారి నిరూపించుకున్నారు. తన తల్లి మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగా ఉండాలని ఆయన చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఎవరైనా తమ తల్లిదండ్రులు చనిపోతే సమాధులు కట్టడం లేదా విగ్రహాలు పెట్టడం చేస్తారు. కానీ సాయాజీ షిండే మాత్రం ప్రకృతిని ప్రేమించే తన తల్లి జ్ఞాపకార్థంగా ఏకంగా 5000 వేల సంఖ్యలో మొక్కలు నాటి, ఒక పెద్ద అడవినే సృష్టించాడు. మహారాష్ట్రలోని తన సొంత గ్రామంలో ఆయన చేపట్టిన ఈ ‘సహ్యాద్రి దేవ్‌రాయ్’ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది మొక్కలను నాటారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. ‘‘మా అమ్మ ప్రకృతిని ఎంతో ప్రేమించేది.

ఆమె చనిపోయినప్పుడు కేవలం ఫోటోకో, విగ్రహానికో పరిమితం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆమె పేరు మీద నాటిన ప్రతి మొక్కలోనూ మా అమ్మను చూసుకుంటున్నాను. ఈ మొక్కలు పెరిగి పెద్దవై గాలిని, నీడను ఇస్తున్నప్పుడు మా అమ్మ ఆశీస్సులు అందరికీ అందుతున్నాయని భావిస్తున్నాను" అని సాయాజీ షిండే ఎమోషనల్ అయ్యారు. సాయాజీ షిండే కేవలం తన తల్లి కోసమే కాకుండా, పర్యావరణం కోసం గత కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు నాటడం, అంతరించిపోతున్న అరుదైన చెట్ల జాతులను కాపాడటం ఆయన డైలీ లైఫ్‌లో భాగమైంది. తాజాగా తన తల్లి జ్ఞాపకార్థం ఆయన చేసిన ఈ గొప్ప పనిని చూసి నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు మాత్రం "మీరు సినిమాలో విలన్ కావచ్చేమో కానీ, నిజ జీవితంలో మాత్రం గ్రేట్ హీరో సర్" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కిరణ్ అబ్బవరంకు షాక్.. ‘క’ సీక్వెల్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత

Next Story