Maruthi: తప్పుల నుంచే పాఠాలు నేర్చుకున్నాను.. ‘ది రాజాసాబ్’ డిజాస్టర్‌పై మారుతి ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-28 14:41:44  IST  )

ప్రతి ప్రయాణం ఒక గుణపాఠం నేర్పుతుంది. ఈ పవిత్రమైన రోజున నా తదుపరి చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు.

Maruthi: తప్పుల నుంచే పాఠాలు నేర్చుకున్నాను.. ‘ది రాజాసాబ్’ డిజాస్టర్‌పై మారుతి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ఈ ఏడాది ప్రారంభంలో అత్యంత భారీ అంచనాల మధ్య, సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం ‘ది రాజా సాబ్’. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టుగా ఉంటుందని అందరూ భావించారు. దాదాపు ₹400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం, మొదటి రోజే ₹100 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. కానీ, నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. మొత్తంగా ₹200 కోట్లు వసూలు చేసినప్పటికీ, సుమారు ₹160-170 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. అంతేకాకుండా విమర్శల పాలైంది. దీంతో మారుతి సైలెంట్ అయిపోయారు. తాజాగా, మళ్లీ కొత్త స్క్రిప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుపుతూ.. ‘ది రాజాసాబ్’ మెప్పించలేకపోవడంపై కూడా రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత మారుతి తన ఇంట్లోని పూజా గదిలో దేవుడి విగ్రహాల ముందు తన తదుపరి ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌ను ఉంచి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోను షేర్ చేశారు.

"ప్రతి ప్రయాణం ఒక గుణపాఠం నేర్పుతుంది. ఈ పవిత్రమైన రోజున నా తదుపరి చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు. మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌ను నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. మీ మెప్పు పొందేలా ఈసారి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను" అంటూ మారుతి రాసుకొచ్చారు. ‘రాజా సాబ్’ విషయంలో ప్రభాస్ ఎంటర్టైనింగ్ వెర్షన్‌ను పాన్ ఇండియా లెవల్లో చూపిస్తానని మారుతి చెప్పినప్పటికీ, అది వర్కవుట్ కాలేదు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ వంటి భామలు నటించిన ఈ చిత్రం జనవరి 9న విడుదలై నిరాశపరిచింది. ఇక ఈ సారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపిన మారుతి.. తన తదుపరి సినిమాలో హీరో ఎవరు? కథ ఏంటి? అన్న వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ప్రభాస్‌కు తల్లిగా మాత్రమే నటించనన్నాను.. ఆ పాత్ర కాదని పూర్తి క్లారిటీ ఇచ్చిన రాశి.

Next Story