‘జైలర్-2’ చాన్స్ కొట్టేసిన హీరోయిన్.. ఈ సినిమా ఆయనకు అంకితం అంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-03 11:21:25  IST  )

Jailer2లో చాన్స్ మనం సాధించాం చిరు! ఒకప్పుడు మనం కలిసి కన్న కలని ఈరోజు నేను నిజం చేశాను. ఈ విజయం, ఈ మైలురాయి అన్నీ నీకే అంకితం.

‘జైలర్-2’ చాన్స్ కొట్టేసిన హీరోయిన్.. ఈ సినిమా ఆయనకు అంకితం అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: నటి మేఘనా రాజ్ 'బెండు అప్పారావు RMP' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత కన్నడ, మలయాళ చిత్రాల్లో రాణించింది. కెరీర్ బాగున్న సమయంలోనే కన్నడ నటుడు చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, విధి ఆడిన వింత నాటకంలో ఆమె భర్త చిరంజీవి సర్జా గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆ సమయంలో మేఘనా గర్భవతి. భర్త మరణం తర్వాత కొడుకు పుట్టిన వేళ.. ఆ బిడ్డలోనే తన భర్తను చూసుకుంటూ ఆమె ధైర్యంగా ముందుకు సాగుతోంది. అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా మేఘనా రాజ్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రాబోతున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘జైలర్-2’లో ఆమె ఒక కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ప్రకటిస్తూ, రజినీకాంత్‌ను కలిసిన ఫోటోలను పంచుకుంది. తన భర్త చిరంజీవి సర్జాకు రజినీకాంత్ అంటే ప్రాణమని, ఆయనతో కలిసి నటించాలనేది తన భర్త కల అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.

తన భర్తను ఉద్దేశించి మేఘనా రాస్తూ.. "చిరు.. ఈ పెళ్లి రోజు కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, ఇది ఒక భావం. నీ కలలు, నా కలలు వేర్వేరు కాదని మనం నిర్ణయించుకున్న రోజు ఇది. నేను వేసే ప్రతి అడుగులోనూ నీ ఉనికిని అనుభవిస్తున్నాను. నువ్వు భౌతికంగా లేకపోయినా నా ద్వారానే జీవిస్తున్నావనిపిస్తోంది. నువ్వు ఆరాధించే భారతీయ సినిమా దేవుడు రజనీకాంత్ సార్‌ను కలిసే అవకాశం, ఆయనతో సినిమా చేసే ఛాన్స్ నీ వల్లే నాకు దక్కింది. Jailer2.. మనం సాధించాం చిరు! ఒకప్పుడు మనం కలిసి కన్న కలని ఈరోజు నేను నిజం చేశాను. ఈ విజయం, ఈ మైలురాయి అన్నీ నీకే అంకితం. హ్యాపీ యానివర్సరీ నా బేబీమా" అంటూ రాసుకొచ్చింది. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా మరణం కన్నడ పరిశ్రమలోనే కాకుండా యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన లేని లోటును భరిస్తూనే, మేఘనా రాజ్ తన వృత్తిలో రాణిస్తూ భర్త ఆశయాలను నెరవేర్చడం చూసి నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో మేఘనాకు అవకాశం రావడం ఆమె కెరీర్‌కు పెద్ద మలుపు కానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఒత్తిడిని భరించలేక ‘తలైవార్-173’ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.. సుందర్ సి షాకింగ్ కామెంట్స్

Next Story