పదమూడేండ్లలోపు స్మార్ట్‌ఫోన్ వాడటం డేంజర్..! ఏం జరుగుతుందంటే..

by Javid Pasha |   (  Updated:2026-01-17 06:13:39  IST  )

13 సంవత్సరాల కంటే ముందు స్మార్ట్‌ఫోన్‌లు కలిగి ఉన్న పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

పదమూడేండ్లలోపు స్మార్ట్‌ఫోన్ వాడటం డేంజర్..! ఏం జరుగుతుందంటే..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వాడకం జీవితంలో ఒక భాగమైపోయింది. దానివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే అతిగా వాడటం మాత్రం పలు అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతుంటారు. పిల్లల విషయంలో అయితే ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని, ముఖ్యంగా 13 ఏండ్లలోపు పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడటం ప్రమాదకరమని జర్నల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ కెపాబిలిటీస్‌లో ఇటీవల పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టడీలో భాగంగా రీసెర్చర్స్ 163 దేశాల నుంచి, 18 నుంచి 24 ఏండ్ల వయసు గల మొత్తం ఒక లక్షకంటే ఎక్కువ మందిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు 13 సంవత్సరాల కంటే ముందు స్మార్ట్‌ఫోన్‌లు కలిగి ఉన్న పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని గుర్తించారు. 12 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సులో మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్ పొందినవారిలో ఆత్మహత్యా ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, వాస్తవికత నుంచి వేరుపడటం, భావోద్వేగ నియంత్రణలో లోపం(Emotional dysregulation), తక్కువ స్వీయ- నిర్ధారణ (Self-evaluation) వంటి సమస్యలు ఎదుర్కొన్నట్టు తేలింది. ఇక బాలురకంటే కూడా బాలికలు ఈ విషయంలో మరింత ఎక్కువగా సమస్యను ఎదుర్కొన్నారని, 5-6 సంవత్సరాల వయస్సులో స్మార్ట్‌ఫోన్ పొందిన బాలికలలో 48% మంది తీవ్రమైన ఆత్మహత్యా ఆలోచనలు నివేదించినట్లు అధ్యయనం పేర్కొన్నది.

చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్ఫియా (CHOP) అధ్యయనం కూడా దాదాపు ఇదే వెల్లడించింది. 12 సంవత్సరాల వయస్సులో స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న పిల్లలు డిప్రెషన్, ఒబేసిటీ, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. దీంతోపాటు పిల్లల్లో సైబర్‌ బెదిరింపులు(Cyberbullying), నిద్ర భంగం, కుటుంబ సంబంధాలలో లోపాలు వంటివి కూడా స్మార్ట్‌ఫోన్ అధిక వాడకంవల్ల కలుగుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు సోషల్ మీడియా యాక్సెస్‌కు దారి తీస్తాయి. ఇది 18 ఏండ్లు దాటిన మానసిక పరిపక్వత ఉన్న యువతపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చు కానీ.. 13 ఏండ్లలోపు వారిలో మాత్రం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే తల్లిదండ్రులు 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ యాక్సెస్‌ను నియంత్రించాలని, డిజిటల్ లిటరసీని ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More..

సోషల్ మీడియా పట్ల GenZలో మారుతున్న వైఖరి.. మెంటల్ పీప్ ముఖ్యమంటున్న యువత!

Next Story