గోల్ఫ్ క్వీన్.. శిక్షా జైన్.!

by Daayi Srishailam |   (  Updated:2025-12-25 06:51:17  IST  )

ఆమె గోల్ఫ్‌లో 90కి పైగా టోర్నమెంట్లు గెలిచింది

గోల్ఫ్ క్వీన్.. శిక్షా జైన్.!
X

దిశ, ఫీచర్స్: ఉత్సాహం.. ఆసక్తి ఉంటే వయసుతో సంబంధం లేకుండా దేంట్లోనైనా రాణించొచ్చు. జైపూర్‌కు చెందిన శిక్షా జైన్ వయసు కేవలం 14 ఏండ్లు మాత్రమే. కానీ ఆమె గోల్ఫ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటికే 90కి పైగా టోర్నమెంట్లు గెలిచింది.

ఏడేళ్ల వయసులోనే..

శిక్షా సూరత్‌లో పుట్టింది. ప్రస్తుతం జైపూర్‌లో ఉంటూ చండీగఢ్‌లో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ తీసుకుంటోంది. చిన్నప్పటి నుంచి శిక్షా వాళ్ల నాన్నతో కలిసి రంబాగ్ గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లేది. అప్పుడామె వయసు ఏడేళ్లు. నాన్నను చూస్తూ ఆటపై ఆసక్తి పెరిగి తనకూ గోల్ఫ్ కొట్టాలనిపించేది. అలా ఏడేళ్ల వయసులోనే గోల్ఫ్ షాట్ కొట్టింది. ఆ శబ్దం.. దూరం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా గోల్ఫ్‌తో ప్రేమలో పడిన శిక్ష.. ఇటీవల అహ్మదాబాద్.. ఢిల్లీలో పోడియం ఫినిష్ సాధించింది. బంగ్లాదేశ్.. థాయిలాండ్.. దక్షిణాఫ్రికా ఛాంపియన్‌షిప్‌లకు అర్హత సాధించింది.

సమర్థవంతంగా ఎదుర్కుంటూ..

దేశంలో తన వయసు విభాగంలో టాప్-3లో ఉంది శిక్ష. అయినా దాంతోనే సంతృప్తి పడాలనుకోవడం లేదు. ఇంతే స్ఫూర్తితో కొనసాగుతూ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకం పైకెగరేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశలో ప్రాక్టీస్ చేస్తోంది. ఉదయం 5 గంటలకు నిద్రలోంచి లేస్తుంది. తర్వాత ఫిట్‌నెస్ ట్రైనింగ్.. టెక్నికల్ స్ట్రాటజీ.. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్.. ఫిజియోథెరపీ ఇవన్నీ డైలీ షెడ్యూల్‌లో ఉంటాయి. హోంవర్క్.. క్లాస్ వర్క్ ఏంటనేది క్లాస్ టీచర్ వాట్సాప్‌లో పంపిస్తుంది. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కుంటేనే జీవితంలో విజయం సాధిస్తామనేది తన అభిప్రాయం.

పీరియడ్స్ వచ్చాయి..

శిక్ష సక్సెస్‌లో పేరెంట్స్ పాత్ర కీలకమైంది. మొదటి టోర్నమెంట్‌లో పాల్గొన్నప్పుడు తన వయసు ఎనిమిదేళ్లు. శిక్ష చాలా భయపడింది. ఆ సమయంలో తన పేరెంట్సే ప్రోత్సాహం ఇచ్చారు. ధైర్యాన్ని నూరిపోశారు. ఇప్పటికీ ప్రతీ మ్యాచ్‌కు వాళ్లే తోడుగా ఉంటారు. గోల్ఫ్.. కేవలం శారీరక ఆట కాదు. అదొక మానసిక భావోద్వేగ ఆట. ఒక టోర్నమెంట్‌లో తనకు పీరియడ్స్ వచ్చాయి. శరీరం సహకరించలేదు. కానీ "పీరియడ్స్ అనేది సాధారణమైన విషయం.. దానివల్ల ఆటను వదులుకోవద్దు" అని తల్లిదండ్రులు ఇచ్చిన మద్దతే ఇప్పటికీ తనను ఛాంపియన్‌గా నిలబెడుతోంది.

లక్ష్యం 2028..

ప్రస్తుతం వరల్డ్ అమెచ్యూర్ గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించింది. ఎన్ని జాతీయ టోర్నమెంట్లు ఆడగలిగితే అన్నీ ఆడుతోంది. కానీ.. తన మొదటి లక్ష్యం ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం. అది 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో జరగనుంది. నీరజ్ చోప్రా నమ్రత.. అదితి అశోక్ నుంచి ప్రేరణ పొంది ఆటలో అదరగొట్టే ప్రతిభను చాటుతోంది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది యువ అథ్లెట్లు ఉన్నారు. కొందరు ప్రశంసిస్తారు.. కొందరు విమర్శిస్తారు. ప్రశంసించినా.. తిట్టినా పట్టించుకోదు శిక్ష. తన లక్ష్యం కోసం కష్టపడుతూ ముందుకు సాగుతోంది. తనకు స్నేహితులు కూడా తక్కువే కాబట్టీ సమయం వృథా కాదు.

Read More..

అహనా అన్‌జంక్‌ ఛాలెంజ్.. ఓపెన్ సీక్రెట్.!

Next Story