- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజువారీ ఇంజెక్షన్లు, మాత్రలకు ఇక గుడ్ బై! శరీరం లోపలే వాటిని ఉత్పత్తి చేసే డివైజ్ వచ్చేసిందిగా..!!
శరీరానికి అవసరమైన మందులను స్వయంగా ఉత్పత్తి చేయగల ఇంప్లాంటబుల్ పరికరాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారు.

దిశ, ఫీచర్స్ : శరీరంలో సంభవించే పలు అనారోగ్యాలను తగ్గించే మెడిసిన్ రాస్తుంటారు డాక్టర్లు. వాటిని మెడికల్ షాపులో కొనుక్కొని వేసుకుంటుంటాం. అయితే ఇలా కొనుక్కునే అవసరం లేకుండా శరీరమే తనకు అవసరమై మెడిసిన్ తయారు చేసుకుంటేనో లేదా శరీరం లోపల అవి ఆటోమేటిగ్గా జనరేట్ అయితేనో ఎంత బాగుంటుంది కదా! ఇదొక ఇమాజినేషన్‌లా అనిపిస్తుండవచ్చు కానీ ఆచరణలో సాధ్యమేనని నిరూపించారు శాస్త్రవేత్తలు. ‘లివింగ్ ఫార్మసీ’ అనే ఈ అద్భుతమైన ఆలోచన ఇప్పుడు బయోటెక్నాలజీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు శరీరంలో ఉంటూ మెడిసిన్ ప్రొడ్యూస్ చేయగల ఒక డివైజ్‌ను డెవలప్ చేశారు.
చర్మం కింద అమర్చితే చాలు..
చర్మం కింద అమర్చడం ద్వారా శరీరానికి అవసరమైన మందులను స్వయంగా ఉత్పత్తి చేయగల ఇంప్లాంటబుల్ పరికరాన్ని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ మరియు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారు. దీనిని HOBIT (Hybrid Oxygenation Bioelectronics System for Implanted Therapy) అని, ‘లివింగ్ ఫార్మసీ’ అని కూడా పిలుస్తున్నారు. ఇది ఆక్సిజన్ ఉత్పత్తి చేసే బయో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌తో ఇంజనీర్డ్ కణాలను సజీవంగా ఉంచి, వాటిని మందులు తయారు చేసే చిన్న ఫ్యాక్టరీలుగా మారుస్తుంది. ఈ లివింగ్ ఫార్మసీలు శరీరంలోని మార్పులను, సంభవించే అనారోగ్యాలు (బ్లడ్ షుగర్, హార్మోన్ లెవెల్స్ మొదలైనవి)ను మానిటర్ చేసి, అవసరాన్ని బట్టి అవసరమైన సమయంలో మాత్రమే నిర్దిష్ట మందులను విడుదల చేస్తాయి. ఇటీవలి జంతు పరీక్షల్లో ఒక్క డివైజ్ మూడు వేర్వేరు బయోలాజికల్ డ్రగ్స్ (యాంటీ-HIV యాంటీబాడీ, టైప్-2 డయాబెటిస్‌కు GLP-1 పెప్టైడ్, ఆకలి నియంత్రణకు లెప్టిన్ హార్మోన్)ను ఏకకాలంలో స్థిరంగా ఉత్పత్తి చేయగలిగింది.
మాత్రలు అవసరం లేదు..
‘లివింగ్ ఫార్మసీ’ డివైజ్ డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, హార్మోన్ సమస్యలు, పలు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి రోజువారీ ఇంజెక్షన్లు లేదా మాత్రలు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్‌ను కూడా తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ యానిమల్(ఎలుకలు) మోడల్స్‌లో వారాల నుంచి నెలల వరకు విజయవంతంగా పనిచేస్తోందని కూడా నిర్ధారించారు. అయితే మానవులపై ఇంకా ప్రయోగాలు జరగలేదు. జరిగినా సక్సెస్ అయ్యే చాన్సెస్ ఉన్నాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇది ఒక్క ఇంప్లాంట్ ద్వారా చాలా కాలం వరకు మెడికేషన్స్ అందించగల ‘మల్టీథెరప్యూటిక్ లివింగ్ ఫార్మసీ’గా మారవచ్చునని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అదే జరిగితే ఇది వైద్యారంగాన్ని పూర్తిగా మార్చి, రోగుల జీవన నాణ్యతను భారీగా మెరుగుపరచే అవకాశం ఉందని, కాకపోతే మానవ పరీక్షలు, భద్రతా పరమైన అధ్యయనాలు ఇంకా జరగాల్సి ఉందని పేర్కొంటున్నారు.






