ఇంటి పన్ను చెల్లిస్తే సరిపోదు.. ఇల్లు మీ సొంతం అయిపోదు.. ఇది తప్పనిసరి..

by Sujitha Rachapalli |   (  Updated:2026-04-18 14:29:21  IST  )

ఎక్కడో ఇల్లు. ఆ ఇంటి డాక్యుమెంట్లు లేవు. కానీ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. 20 ఏళ్లుగా ఇంటి పన్ను కడుతున్నాం.. అందుకే ఇంటిపై లీగల్‌‌గా హక్కులు వస్తాయన్న అపోహలు ఉన్నాయి.

ఇంటి పన్ను చెల్లిస్తే సరిపోదు.. ఇల్లు మీ సొంతం అయిపోదు.. ఇది తప్పనిసరి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్కడో ఇల్లు. ఆ ఇంటి డాక్యుమెంట్లు లేవు. కానీ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. 20 ఏళ్లుగా ఇంటి పన్ను కడుతున్నాం.. అందుకే ఇంటిపై లీగల్‌‌గా హక్కులు వస్తాయన్న అపోహలు ఉన్నాయి. అందుకే ఎక్కడైనా ప్రభుత్వ స్థలం కనబడగానే ఇంటిని ఇల్లీగల్‌గా కట్టుకుంటున్నారు. కొందరేమో అది ప్రభుత్వ స్థలమని తెలియక కట్టిన ఇంటిని కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు బిల్లు ఉంది. ఇంటి కనెక్షన్ తమ పేరిటే ఉంది.. దీంతో హక్కులు మావే అనుకుంటున్నారు. కానీ 30 ఏళ్లుగా టాక్సులు కట్టినా, 20 ఏళ్లుగా కరెంటు బిల్లులు చెల్లించినా.. వాటర్ కనెక్షన్ మీ పేరిట ఉన్నా.. ఆఖరికి ఆ ఇల్లీగల్ ఇంటికి ఇంటి నంబర్ ఉంది కదా అనుకున్నా.. దానిపై హక్కులు ఉండవు. చట్టం ఏం చెబుతుందో పరిశీలించుకోవాలి. బ్రోకర్లు .. లేదంటే ఆ ఇంటిని అమ్మేటోళ్లు చాలా చెప్పొచ్చు. రిజిస్ట్రేషన్ కాకపోయినా నోటరీ ద్వారా కొనొచ్చునని, తక్కువ ధరకే వస్తుందని ఆశలు రేకెత్తిస్తుంటారు. కానీ అవన్నీ చట్టపరంగా నిజం కాదు. హైడ్రా వంటి సంస్థ వచ్చిందంటే అన్నీ మాయమవుతాయి. లక్షలు పోసిన ఇండ్లు నేలమట్టం అవుతాయి. అందుకే నిజాలు తెలుసుకోవాలి.

వాస్తవాలు

– మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్ వాళ్లు మా దగ్గర ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అందుకే మా ఇల్లు మాకు చట్టబద్ధం అనుకుంటే పొరపాటు.

– కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు మీ పేరు మీద ఉన్నా.. ఇంటి నంబర్ వచ్చినా .. అవి యాజమాన్యానికి కాదు. కేవలం మీరు అక్కడ నివసిస్తున్నారని చూపించే ఆధారాలు మాత్రమే.

– అసలు చట్టబద్ధత అనేది బిల్డింగ్ పర్మిషన్, ఇతర అనుమతుల మీద ఆధారపడి ఉంటుంది.

– అధికారులు కూడా ఇన్ని సంవత్సరాలు ట్యాక్స్ తీసుకుని, ఒక్కసారిగా నోటీసు లేకుండా కూల్చివేయడం చట్టపరంగా సరైంది కాదు.

– అందుకే సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసే వాటికే హక్కులు లభిస్తాయి.

– నోటరీ ద్వారా కొనుగోలు చేస్తే.. గ్యారంటీ లేదు.

హక్కులు

– మీ ఇల్లు కూల్చే ముందు అధికారులు తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలి.

– మీ వాదన వినడానికి అవకాశం ఇవ్వాలి.

– కోర్టుకు వెళ్లి ఆ చర్యను సవాలు చేసే హక్కు మీకు ఉంది.

– చాలా సందర్భాల్లో ఇలాంటి ఇల్లీగల్ ఇండ్ల క్రమబద్ధీకరణ పథకాలను ప్రభుత్వం అమలు చేసింది. ఉదాహరణకు జీవో 58, 59 ల ద్వారా లక్షల ఇండ్లను క్రమబద్ధీకరించారు.

Read More.. కాస్ట్‌లీ అయిపోయిన ఇళ్ల నిర్మాణం.. మరీ ఇంత పెరిగితే ఎలా?

Next Story