- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : నిద్రకుముందు ఇలా చేయండి..! స్ట్రోక్ రిస్క్ తగ్గుతుందంటున్న నిపుణులు
శరీరంలో నీటిశాతం తగ్గితే రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి గుండె అలసటకు గురవుతుంది. స్ట్రోక్ రిస్క్ పెరిగే చాన్స్ ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : రాత్రిళ్లు మీ శరీరంలో అనీజీగా అనిపిస్తోందా? అయితే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. డైలీ పడుకోవడానికి 5 నిమిషాల ముందు ఒక గ్లాస్ మంచినీళ్లు తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. రాత్రిపూట నీరు తాగకపోవడంవల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా తక్కువ నీళ్లు తాగేవారిలో ఈ రిస్క్ ఎక్కువ. నిర్లక్ష్యం చేస్తూ పోతే.. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. కార్డియో వాస్కులర్&హైడ్రేషన్ రీసెర్చ్ జర్నల్స్‌లో పబ్లిషైన అధ్యయనాలు కూడా ఇదే చెబుతున్నాయి.
నిద్రపోయేముందు తాగే ఒక్కగ్లాస్ వాటర్ కూడా మీ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొందరు పగలు సరిగ్గా నీళ్లు తాగరు. రాత్రిళ్లు కూడా సరిగ్గా తాగరు. దీనివల్ల నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో నీటిలోపం ఏర్పడి రక్తం కొద్దిగా గట్టిపడే చాన్స్ ఉంటుందని, దీంతో రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి హార్ట్ స్ట్రెయిన్ అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధ్యయనాల ప్రకారం కూడా సరైన హైడ్రేషన్ కలిగి ఉన్నప్పుడే శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ పరిస్థితి బ్లడ్ ప్రెజర్‌ను సమతుల్యం చేస్తుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది.
హైడ్రేషన్ ఎందుకు ముఖ్యం
నిద్రలో శరీరం శ్వాస ద్వారా, చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. ఈ పరిస్థితి మైల్డ్ డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. రక్తం గట్టిపడటంవల్ల హృదయం, మెదడుకు సరైన రక్త ప్రవాహం తగ్గుతుంది. దీంతో స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది. అలా జరగకూడదంటే రాత్రిపూట కూడా శరీరంలో తగిన మోతాదులో నీటిశాతం ఉండాల్సిందే. ఇది గుండెకు మంచి సపోర్ట్ ఇస్తుంది.
ఏం చేయాలి?
నీటిలోపం వల్ల ఏర్పడే డీహైడ్రేషన్, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గాలంటే.. నిద్రపోయేముందు ఒక చిన్న గ్లాసెడు (150–200 మి.లీ) నీరు తాగాలి. రాత్రిళ్లు టాయిలెట్‌కు ఎక్కువసార్లు వెళ్లాల్సిన సమస్య ఉన్నవారు అయితే నిద్రకు కనీసం 30 నిమిషాల ముందు కొంచెం తక్కువ అయినా సరే నీరు తాగడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నీరు తాగడం అనేది సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే. అంతేతప్ప నీరు తాగడమే స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌లను నివారించదు. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నవారు ఈ విషయంలో డాక్టర్లను సంప్రదించి వారి సలహాలు పాటించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






